గద్వాల : పాత కక్షలతో ఈనెల 10వ తేదీన జోగులాంబ గద్వాల ( Gadwal )జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు ( Accused Arrest ) చేశారు. మండలంలోని శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారు పొలాల్లో గుంటిపల్లి రాజు అలియస్ డోజర్ రాజు (42) అనే వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారని డీఎస్పీ వై. మొగులయ్య ( DSP Mogulaiah ) బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
గుంటిపల్లి రాజు ఈనెల 10న సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణయ్యగౌడ్ పొలం వద్ద బోరు వేస్తుండగా చూడటానికి వెళ్లాడని, అదే సమయంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న ప్రత్యర్థులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని వివరించారు. తీవ్ర గాయాలైన రాజును గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని వివరించారు.
మృతుడు గుంటిపల్లి రాజుకు, అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య సైదమ్మతో గతంలో అక్రమ సంబంధం ఉండేదని ఆ సమయంలో ఆంజనేయులు చంపిన కేసులో రాజుకు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడగా హైకోర్టు నుంచి బెయిల్పై గ్రామంలో ఉంటున్నాడని తెలిపారు.
అయితే ఆంజనేయులు కుమారులు దొబ్బిలి విజయ్ కుమార్, బాల నేరస్థుడు, బంధువులు దొబ్బలి లోకేష్, గోవర్ధన్, దొబ్బిలి శ్రీరాములు కలిసి ఈనెల 10న రాజును కర్రలతో కొట్టి హతమార్చారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను
బుధవారం గద్వాల పట్టణంలోని కోట ప్రాంగణంలో అరెస్ట్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ టంగుటూరి శ్రీను, రూరల్ ఎస్సై సిహెచ్. శ్రీకాంత్ పాల్గొన్నారు.