జడ్చర్ల టౌన్, మార్చి 17 : టైరు పేలడంతో అదుపుతప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని హైవే-44పై చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని న్యూ ప్రేమ్‌నగర్‌కు చెందిన మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి(78), అతడి కు మార్తె శ్వేత, మనుమడు హర్షిత్‌రెడ్డి(24) ముగ్గురు కలసి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు.
జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే కారు వెనుక టైరు పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతల రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో జడ్చర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. కారులో ఇరుక్కున ముగ్గురిని స్థానికులు గుర్తించి బయటకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్స్ పాలమూరు ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వెంకట్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి మృతి చెందగా, శ్వేత గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.