అయిజ/దేవరకద్ర/భూత్పూరు/గట్టు/జడ్చర్ల టౌన్/పాలమూరు/ధన్వాడ, ఆగస్టు 25 : మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొన్ని రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దున లేచింది మొదలు, రాత్రయ్యే వరకు పీఏసీసీఎస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చెప్పులు, పాసు బుక్కులు, ఆధార్ జిరాక్స్‌లు, రాళ్లు పెట్టి పడిగాపులు కాస్తున్నా అనుకున్న స్థాయిలో యూరియా అందడం లేదని వాపోతున్నారు. పంటలు సాగు చేసి సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అయిజ పీఏసీసీఎస్కు యూరియా సరఫరా కాకపోవడంతో కార్యాలయం ఆవరణలో ‘యూరియా స్టాక్ లేదు’ అని నోటీసు బోర్డు పెట్టారు.
యూరియా స్టాక్ వస్తేనే రైతులకు టోకెన్లు ఇస్తామని చెప్పి పంపారు. కార్యాలయంలో పడిగాపులు కాయొద్దని, ఇండ్లకు వెళ్లి పనులు చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యాలయం ఆవరణలో రైతులు కూర్చోగా, పోలీసుల సాయంతో పీఏసీసీఎస్ సిబ్బంది రైతులను బయటకు పంపారు. దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వరిసాగు విస్తృతంగా చేపట్టిన రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పీఏసీసీఎస్ వద్ద యూరియా లేక పోవడంతో ఫర్టిలైజర్ షాపుల వద్ద ఉదయం నుంచి క్యూలో నిలబడినా కేవలం రెండు బస్తాల యూరియా దొరికిందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూత్పూరు మండలంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
సోమవారం ఆదిత్య ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వస్తుందని తెలియడంతో రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. పంపిణీ సందర్భంగా గందరగోళం నెలకొనడంతో పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. గట్టు రైతులకు యూరియా వెతలు తప్పడంలేదు. సోమవారం యూరియాను పంపిణీ చేస్తారని సమాచారం తెలుసుకున్న రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే కార్యాలయానికి వచ్చి వరుస క్రమంలో పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ ప్రతులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి తాము యూరియాను తీసుకోవడానికి లైన్లో ఉన్నామని చెప్పకనే చెప్పారు.
అయితే యూరియా సోమవారం రాదని, మంగళవారం రావచ్చని సిబ్బంది చెప్పడంతో రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత మాటే లేదని రైతులు బాహాటంగా చెబుతున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా బస్తా కోసం రోజూ ఇక్కడొచ్చి గంటల తరబడి లైన్లో నిలబడుతున్నాం కానీ.. ఇంటి వద్ద వంటవార్పు, పిల్లల చదువులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని అగ్రో దుకాణం ఎదుట ఆందోళన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల వద్దకే యూరియాను పంపిస్తే.. ఇపుడేమో రైతులే యూరియా దుకాణాల వద్దకే వచ్చి క్యూలైన్లో నిలబడేలా కాంగ్రెస్ సర్కారు చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు ప్రణీల్‌చందర్, జ్యోతి, మహేశ్, ప్రశాంత్‌రెడ్డి, శశికిరణ్, ఉమాశంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఎరువుల దుకాణం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అయితే డీలర్ ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే అందజేయడంతో అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా యూరియా దొరకడం లేదని, ఇలాగైతే పంటు కాపాడుకోవడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వాడలో యూరియా కోసం రైతులు ఎంతోగానో ఎదురు చూస్తున్నా నిరాశ తప్పడం లేదు. సోమవారం పీఏసీసీఎస్కు 300 బస్తాల యూరియా రాగా ఏవో నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో రైతుకు రెండు బస్తాల యూరియాను పంపిణీ చేశారు. కేవలం 150 మంది రైతులకు మాత్రమే యూరియా అందడంతో మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు.
నేను మూడెకరాల్లో వరిపైరును సాగుచేశాను. నాటుకు ముందు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను వేశాను. మొదటి విడుతగా యూరియా వేద్దామని అనుకోగా ఎక్కడా యూరియా లభించలేదు. దీంతో నానో యూరియాను పైరుకు పిచికారీ చేశాను. వరిపైరుకు యూరియా వేయకపోవడం జీవితంలో తొలిసారి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏ ఎరువుకు కొరత లేకుండే. ఇలాంటి పరిస్థితిని నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి చూడలే.
– రాఘవరెడ్డి, రైతు, మిట్టదొడ్డి, గట్టు మండలం, గద్వాల జిల్లా