నారాయణపేట, డిసెంబర్ 16 : ధర తగ్గిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్కు ఎర్రకందులు 6,193 క్వింటాళ్లు (3,031 బ్యాగులు), నల్లకందులు 8 క్వింటా ళ్లు (4 బ్యాగులు), తెల్లకందులు 1,585 క్వింటాళ్లు (770) బ్యాగులు.. మొత్తం 7,786 క్వింటాళ్లు.. 3,805 బ్యాగులు విక్రయానికి కర్షకులు తీసుకొచ్చారు. రెండ్రోజుల వ్యవధిలోనే కంది క్వింటాకు రూ.2 వేలు ధర పడిపోయిందన్న విషయాన్ని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి స్పందించి వ్యాపారస్తులతో కలిసి చర్చించి సమస్య పరిష్కరిచుకుందామని సూచించడంతో రైతులు శాంతించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కార్యాలయ అధికారులు బీకేఎస్ నాయకులు వెంకోబా, అనంతరెడ్డి, సీపీఎం నాయకులు వెంకట్రామిరెడ్డి, బాల్రాం, రైతు సంఘం నాయకులు అంజిలయ్యగౌడ్ తదితరులతో చర్చలు జరిపారు.
అయితే పై నుంచి ధరలు తగ్గడం వల్లనే శని, సోమవారాల్లో వచ్చిన ధరల్లో వ్యత్యాసం వచ్చిందని అధికారులు తెలిపారు. ఒక్కో రైతుకు ఒక్కో ధర కేటాయించారని, పొంతన లేకుండా ధరలు కేటాయించి తమను తీవ్రంగా నష్టపరుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఆరుగాలం క ష్టపడి కంది పంటను పండించాను. కం దులను విక్రయించేందుకు సోమవారం పేట మార్కెట్ యార్డుకు వచ్చాను. మార్కెట్లో శనివారం ఉన్న ధర సోమవారం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం ఎర్రకందులు గరిష్ఠంగా రూ.10,500 పలుకగా తెల్లకందులు రూ.11,500 పలికాయి. కానీ శనివారానికి సోమవారానికి రూ.2వేలు తగ్గించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి. పొద్దుగాల ఒక గంట ఆలస్యమైతే టెండర్లు తీసుకోరు. కానీ ఈ రోజు నాలుగు గంటల వరకు రైతులను వేచి ఉంచడం ఎంతవరకు సమంజసం.
– నరేందర్, రైతు, కందెన్పల్లి, దామరగిద్ద
నా పొలంలో పండిన 3 ప్యాకెట్ల కందులను విక్రయించేందుకు 60 కిలోమీటర్ల దూరం నుంచి పేట మార్కెట్ వచ్చాను. శనివారం మార్కెట్లో కందుల ధర రూ.10,500 నుంచి రూ.11,500 వరకు పలికింది. సోమవారం మాత్రం రూ.2వేలకు పైగా తగ్గించారు. ఒకే రోజు రూ.2వేలు తగ్గడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ధర తగ్గడంలో దళారుల పాత్ర కంటే మార్కెట్ అధికారులపాత్ర ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి కావల్సిన టెండర్లు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగించడం ఎంతవరకు సరైంది. అసలే చలికాలం తాము పంటలను విక్రయించుకొని చలిలో ఊర్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది.
– రమేశ్నాయక్, రైతు, దౌల్తాబాద్
శని, సోమవారానికి ధరల వ్యత్యాసంతో క్వింటా కందుల వెం ట రూ.2 వేల ధర తగ్గడంతో ఆందోళకు దిగిన రైతుల తరపున రైతు, కార్మిక సంఘాల నాయకులు మార్కెట్ అధికారులు, వ్యా పారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం టెం డర్లో పలికిన ధరలకు రూ.500 పెంచి ఇవ్వాలని కార్మిక సం ఘాల నాయకులు డిమాండ్ చేయగా.. రూ.100 వరకే పెంచుతామని వ్యాపారులు చెప్పడంతో రైతు సంఘాల నాయకులు అంగీకరించకపోవడంతోపాటు చర్చల నుంచి వెనుదిరిగారు.