నారాయణపే ట, డిసెంబర్ 17 : గత శనివారంతో పోలిస్తే సోమవారం ఒక రోజే నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో ఒకేసారి కంది క్వింటాపై రూ.2వేలకు పైగా ధర పడిపోవడంతో సోమవారం రైతులు ఉన్న ఫలంగా మొదలు పెట్టి న ఆందోళనను మంగళవారం సైతం కొనసాగించారు. సోమవారం ఆందోళనతో నిలిచిపోయిన కొనుగోళ్లలో కొంత మం ది రైతులు తమ తమ ఇండ్లకు వెళ్లిపోగా మిగిలిన రైతులు మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల వద్దే నిద్రపోయారు.
మంగళవారం మార్కెట్ యార్డుకు కందుల విక్రయానికి వచ్చిన రైతులు, నిన్నటి రైతుల తో కలిసి ధర పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా రైతు సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు అధికారులతో చర్చలు జరిపారు. సోమవారం ఖరీ దుదారులు చెప్పిన క్వింటాకు రూ.100 ధర పెంపు విషయమే మళ్లీ అధికారులు చెప్పడంతో సోమవారం టెండర్లో పలికిన ధరకు క్వింటా వెంబడి రూ.500 పెంచి ఇవ్వాలని రైతు లు పట్టుబట్టారు. అందుకు ఖరీదుదారులు ఒప్పుకోకపోవడంతో కొంత మంది రైతులు వ్యవసాయ మారెట్ యార్డు ఎదుట ప్రధాన రహదారిపై, మరి కొందరు రైతులు అంబేదర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు.
కలెక్టర్ రావాలి తమ స మస్యలను పరిషరించాలని, రెండు రోజులుగా ఆందోళన చే పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నా మొదలైన దాదాపు గంటన్నర తర్వాత ఆర్డీవో రామచందర్ అంబేదర్ చౌరస్తా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతుల డిమాండ్‌పై మారెట్ అధికారులు, ఖరీదుదారులతో చర్చిస్తానని గంట సమయం ఇవ్వాలని అంత వరకు ధర్నా విరమించాలని కోరడంతో అం బేదర్ చౌరస్తా వద్ద రైతులు ధర్నా విరమించి, మారెట్ యార్డు వద్ద చేపడుతున్న ఆందోళన వద్దకు చేరుకున్నారు.
అక్కడ కూడా ఇదే విషయం చెప్పేందుకు ఆర్డీవో ప్రయత్నించ గా అందుకు రైతులు ఒప్పుకోలేదు. ఏదైనా తమముందే మా ట్లాడాలని, అది కూడా ఇకడ రోడ్డు మీదే చెప్పాలనని పట్టుబట్టి రాస్తారోకోను కొనసాగించారు. మరోవైపు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మారెట్ చైర్మన్ సదాశివరెడ్డి అధ్యక్షతన మారెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్, మార్కెటింగ్ శాఖ ఏడీఎం బాలమణి, రైతు సంఘాల నాయకులు ఖరీదు దారులతో చర్చలు జరిపారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా క్వింటాకు రూ.500 పెంచి ఇవ్వలేమని అలా చేస్తే తీవ్రంగా నష్టపోతామని ఖరీదుదారులు తేల్చి చెప్పారు.
సోమవారం జరిగిన చర్చల్లో చెప్పినట్లుగానే కింటాపై రూ. 100 మాత్రమే పెంచి ఇస్తామని మరోమారు చెప్పారు. అలా కాదని సోమవారం టెండర్లో పలికిన ధరపై క్వింటాలకు రూ. 225 పెంచి ఇవ్వాలని అధికారులు ఖరీదుదారులకు నచ్చ జెప్పారు. ఇదే విషయాన్ని అధికారులు, మారెట్ చైర్మన్లు రాస్తారోకో వద్దకు చేరుకొని రైతులకు ఖరీదుదారులతో జరిగిన చర్చల విషయాన్ని వారు చెప్పిన రూ.225 రూపాయల విషయాన్ని చెప్పారు. అందుకు కూడా రైతులు ఒప్పుకునేది లేదని కనీసం రూ.400 అయినా పెంచి ఇవ్వాలని పట్టుబట్టారు. అన్ని మారెట్లలోనూ కందుల ధర ఒక్కసారిగా పడిపోయాయని అందులో భాగంగా నారాయణపేట లో కూడా కందుల ధర తగ్గిందని చివరగా క్వింటాకు రూ.250 రూపాయలు పెంచి ఇస్తామని రైతులకు నచ్చచెప్పడంతో రైతులు శాంతించి రాస్తారోకోను విరమించారు.