‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్‌తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడుపోతుందో తెలియక ఇబ్బందులు పడ్డాం. పంటలకు నీళ్లు పారించేందుకు సకాలం లో కరెంట్ ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల వద్ద జాగరణ చేయాల్సి వచ్చేది. సాగునీళ్లు అందక.. పంటలు పండక ఎంతోమంది రైతులు అప్పులపాలై ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్న రైతుల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం వెలుగులు నింపింది. స్వరాష్ర్టాన్ని సాధించడమే గాకుండా ముందుచూపుతో ప్రత్యేక చొరవతో 24 గంటలూ నాణ్యమైన విద్యు త్ను సరఫరాచేసి వ్యవసాయానికి ఎలాంటి లోటు లేకుండా చేసింది. ఒకవైపు పెట్టుబడి సాయం, రైతుబీమా.. మరోవైపు పుష్కలంగా సాగునీరు, నిరంతర విద్యుత్ అందించి రైతును రాజు చేశారు. దీంతో దర్జాగా పంటలు సాగు చేసుకున్నాం’ అంటూ ఉమ్మడి జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. ఒక వ్యవసాయమే కాదు.. అన్ని రంగాలనూ గాడిన పెట్టి ‘పవర్ఫుల్ తెలంగాణ’గా నిలబెట్టిన కేసీఆర్‌ను.. కాంగ్రెస్ సర్కారు కావాలనే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బద్నాం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరిత పోకడలు మాని వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతు రాజు అయ్యా డు. బీఆర్ఎస్ హయాంలో 24గంటల కరెంట్ ఉచితంగా రైతులకు అందించగా కాంగ్రెస్ హయాంలో ఏడు గంటల కరెంట్ సక్రమంగా అందేది కాదు. రాత్రి వేళలో ఉండడంతో రైతులు పొలాల వద్ద పడిగాపులు గాసి పాముకాటుకు, కరెంట్ షాక్‌కు గురై ఎంతో మంది ప్రాణాలొదిరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడడంతో పాత రోజులను మళ్లీ గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రెండు పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పంట కూడా పండించలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఒక సర్వసభ్య సమావేశంలో ట్రాన్స్‌కో డీఈ మాట్లాడు తూ రైతులు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ 24 గంటలు అందిస్తున్నదని సభలో చెబుతున్న సమయంలో కరెంట్ పోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందుదో ఇటు రైతులు, సామాన్య ప్రజలకు అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.
కాంగ్రెసోళ్ల పాలనలో రాష్ట్రం పదేండ్లు వెనక్కి పోయినట్లుంది. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే కరెంట్ కష్టాలు షురు ఐనయ్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరెంట్ కష్టాలను కాంగ్రెస్ మల్లా తీసుకొచ్చింది. తెలంగాణ రాకముందు ఎవుసం చేయడం శానా కష్టంగా ఉండేది. రాత్రిపూట మాత్రమే బోర్ల కరెంట్ ఇచ్చేటోళ్లు. అదికూడా పోయి పోయి వచ్చేది. రైతులందరూ సేన్ల కాడనే పండుకునేటోళ్లం. కరెంట్ పోయి వచ్చినప్పుడల్లా మోటర్లు ఆన్ చేసుకునేవాళ్లం. నిద్రమబ్బుల మోటర్ ఆన్ చేయనిక్కె పోయి షాక్ కొట్టి ఎంతోమంది రైతులు సచ్చిండ్రు. రాత్రిపూట సేన్లకాడ పండుకొని ఎంతోమంది పాముకాటుకు, విషపురుగులకు బలయ్యిండ్రు. అప్పట్ల ఆ కష్టాలతోటి ఎవుసాన్ని వదిలి శానామంది ఉప్పరి పనికి పోయిండ్రు. ఇండ్లకు తాళాలు వేసి సేన్లను బీళ్లు పెట్టి ఊరుగాని ఊరికి కూలిపని కోసం పోయి కడుపు నింపుకొనేటోళ్లు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు సీఎం అయ్యి కరెంట్ కష్టాలు లేకుండా చేసిం డు. ఇండ్లకు, ఎవుసానికి 24 గంటలు ఉచిత కరెంటిచ్చిండు. పగటిపూటనే మోటర్లు పెట్టుకొని మడులు పారిచ్చుకునేటోళ్లం. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందజేసి ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చి రైతులను ఆదుకున్నరు. ఈ దెబ్బకు ఊరు ఇడిసి వలస పోయినోళ్లందరూ తిరిగొచ్చిండ్రు. పదేండ్ల పాటు ఎవుసాన్ని పండుగలెక్క చేసుకున్నం. రైతులకు అన్నిరకాలుగా మంచిచేసింది మాత్రం కేసీఆర్ సారే. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ సర్కారు కరెంట్ కోతలను మళ్లీ తీసుకొచ్చింది. రైతుల పరిస్థితి శానా కష్టంగా మారింది. రానురాను ఇంకేమైతదో అని భయమైతుంది. కేసీఆర్ సారు ఉండింటే ఇట్లా కాకుండె. కట్టింగ్స్ లేకుండా కరెంట్ ఇవ్వాలంటే కేసీఆర్ సారే రావాలి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధకుడు కేసీఆర్ సీఎం అయ్యినంక వ్యవసాయానికి పెద్దపీట వేసిండు. అందులో భాగంగానే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని మాట ఇచ్చి పదేండ్ల ఆయన పాలనలో కరెంట్ కోతలు చూడలేదు. వ్యవసాయం చేసే ప్రతి రైతు కేసీఆర్ సార్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నాడు. కాంగ్రెస్ పాలన సురువైన తర్వాత ప్రతి రోజూ కరెంట్ కోతలే చూస్తున్నాం. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంట్ కోతలు ఉండడంతో పంటలు పండుతాయన్న నమ్మకం లేదు.
ఎండాకాలం కూడా కరెంట్ కోసం ఇంత తిప్పలు పడలే. నాకున్న నాలుగెకరాల్లో నాటుకునేందుకు నారుపోసుకున్న. ఇప్పుడు కరెంట్ సక్కగ లేక నారు ఎండిపోయేటట్లు ఉంది. ఇంతగానం కరెంట్ తీస్తే.. కరిగెట చేయాలన్నా.. నాట్లు వేసుకోవాలన్నా తిప్పలైతది. టీవీల ముందర కూసుంటే పెద్ద, పెద్ద వానలు పడినయని చెప్తున్నరు. అవబ్బా నీళ్లకు ఇబ్బంది ఉంది అన్నిక్కె లేదు. డ్యాంలళ్ల నీళ్లు మస్తుండాయి. కరెంటేమో ఒకటే తీస్తరు. ఇన్ని దినాలు ఇట్లా లేకుండే అబ్బా. నేను కొన్నేండ్ల నుంచి అడివి పని చేస్తున్న కానీ.. ఈసారి కరెంట్ కోసం మంది చాన తిప్పలు పడుతున్నరు. ఇప్పడింతల ఎలక్షన్ గిట్లా వస్తే కరెంట్ కోసం కేసీఆర్‌కే ఓట్లేస్తరు.