కౌకుంట్ల(దేవరకద్ర), జూలై 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అలవి కాని హామీలను ఇచ్చి మాయమాటలతో ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఆలకు గులాబీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డోకూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మారుతి, శివకుమార్, మల్లెల ఈరన్న, హరీశ్, భాస్కర్, జంగం నాగేశ్తోపాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అ నంతరం ఆల మాట్లాడుతూ కేసీఆర్ ప్రభు త్వ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హతగల ప్రతి ఒక్కరికీ అందేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హత ఉన్నా ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రతి రోజూ నాయకుల చుట్టూ తిరిగి అలిసి పోతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సమయానికి రైతుబంధు పెట్టుబడితో సంతోషంగా ఉండేవారని, ఇప్పుడేమో రైతుబంధు సరిగా రాక, సమయానికి ఎరువులు దొరకక, కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పు డు పోతుందా.. అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆల ప్రీతి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, పీఏసీసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు చల్మారెడ్డి, పరమేశ్, సత్యంసాగర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.