గద్వాల, జూన్ 24 : మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు. భూమిలో విత్తనాలు విత్తిన తర్వాత వర్షం ముఖం చాటేయడంతో రైతన్నలు వర్షం కోసం ప్రతిరోజూ ఆకాశం వైపు చూసున్నా వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో రైతన్న కన్నీరుమున్నీరవుతున్నాడు.
ఎల్నీవో శాపంతో నైరుతి రుతుపవనా లు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. గతేడాది వానకాలంలో జూరాలకు ముందస్తు వరదలు రావడంతో రైతులు సంతోషంతో సాగుకు సిద్ధమై వర్షాలపై ఆధారపడకుండా పంటలు సాగు చేశారు. అయితే ఈ ఏడాది వానకా లం ప్రారంభమైనా జూరాలకు పూర్తిస్థాయిలో వరద రాకపోడంతో జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ప్రారంభంలోనే కరువుఛాయలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని తొలకరి వర్షానికి రైతులు ఎవరూ పంటలు సాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచించినప్పటికీ రైతులు అక్కడక్కడ పావుల వంతు భూమిలో విత్తనాలు విత్తారు. విత్తనాలు విత్తని రైతులు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. విత్తిన రైతులు సాగు కోసం ఖర్చు చేసిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరేనా అని లోలోన మదనపడుతున్నారు.
ప్రభుత్వం ఎలాగో రైతులకు సహకరించలేదని, ప్రకృతి కూడా రైతులపై కక్ష గట్టిందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు బాగా పండి అప్పుల ఊబి నుంచి బయట పడదామని సాగుకు సిద్ధమైనా వరుణుడు మాత్రం రైతులపై కరుణించడం లేదు. బోరు బావులు ఉన్న రైతు లు అక్కడక్కడ విత్తనాలు విత్తారు. మరి కొంతమంది రైతులు నారుమడులు పోసుకున్నారు. వర్షాలు కురువక పోవడంతో బోరుబావుల్లో నీరు తగ్గిపోవడంతో విత్తిన విత్తనాలు మొలక ఎత్తించడానికి నానా అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వాస్తవంగా రైతులు జూన్లో వరి నారు మడులు సిద్ధం చేసుకోవాల్సి ఉండగా వర్షాలు కురువకపోవడం, ప్రాజెక్టుల్లో నీరు లేక పోవడంతో నారుమడులు పోసుకోవడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. కొందరు బోరు బావులు ఉన్నవారు నారు మడులు పోసుకున్నా దానిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వానకాలంలో రైతులు జిల్లాలో 4.45లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 3.93లక్షల ఎకరాలు అగ్రికల్చర్, హార్టికల్చర్ 48వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ప్రధానంగా వరి 1.22లక్షల ఎకరాలు, పత్తి 2.13లక్షల ఎకరాలు, మొక్కజొన్న 22వేల ఎకరాలు, మిర్చి 48వేల ఎకరాల్లో , కంది 23,739, వేరుశనగ 6396 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. వరుణుడు మొఖం చాటేయడం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండకపోవడంతో వానకాలం సాగుపై సందిగ్ధత నెలకొన్నది. వరుణుడు కరుణిస్తే తప్పా రైతులు సాగుకు సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు. వరుణుడు కరుణించి వర్షాలు కురువాలని రైతులు నిత్యం ఆకాశంపైపు చూస్తున్నారు.