మూసాపేట, మార్చి 12 : కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘణపూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా వచ్చే సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ సర్కా రు కాల్వల ద్వారా మూసాపేట మండలంలో ని పెద్దవాగులో వదలడంతోపాటు, చెరువులు కుంటలు నింపేవారు. అదేవిధంగా ఈ ప్రభు త్వం కూడా సాగునీటికి తీసుకొస్తుందని ఆశించిన అన్నదాతలకు నిరాశేమిగులుతున్నది.
మూసాపేట మండలంలోని నిజాలాపూర్ గ్రా మంలో వాగు పరిసరాలతోపాటు చెరువులు, కుంటల కింద దాదాపుగా 300 ఎకరాల వర కు వరి పంటను సాగుచేశారు. ఇప్పటికే వాగు లో నీరు ఎండు ముఖం పట్టాయి. సాగునీటి కోసం చిన్న మడువకు కూడా రైతులు నానా తంటాలు పడుతున్నారు. రోజురోజుకు పంట లు ఎండుమొఖం పడుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కేఎల్ఐ ద్వారా నీరు రాకపోతే పూర్తిగా గ్రామంలో 90 శాతంకు పైగా పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి పెద్దవాగు ద్వారా కేఎల్ఐ నీళ్లు విడుదల చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అప్పుడే గండం నుంచి బ యటపడుతామని అంటున్నారు.
వరి పంట సాగుచేయక ముందు కేఎల్ఐ నీళ్లు యథా విధిగా వస్తాయి సాగుచేయమని స్థానిక నాయకులు చెప్పారు. అందుకే వరి పంటను సాగుచేశాం. కానీ ఇప్పు డు నీళ్లు రాకపోవడంతో పంట ఎండుతున్నది. కేఎల్ఐ నీళ్లు రాకపోతే నాతో పాటు చాలా మంది రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఒక్క కుర్వోని కుంట కిందే 130 ఎకరాలు ఎండిపోతాయి. రెండు, మూడ్రోజుల్లో నీళ్లు రాకపోతే పంటలు ఖతమే.. ఎలాగైనా కేఎల్ఐ నీళ్లు అందించండి.. లేదంటే మా బతుకులు ఆగమవుతాయి.
– మోతుగారి వెంకటేశ్, రైతు, నిజాలాపూర్, మూసాపేట మండలం
గత ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మంచి చేసింది. వాగులో చెక్‌డ్యాంలు కట్టి సంవత్సరం పొడవునా పెద్దవాగులో నీరు పారించే వారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సాగునీటి వనరులను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో పెద్దవాగు పూర్తిగా ఎండిపోయింది. వ్యవసాయ బోరు బావుల్లో భూగర్భ జలం అడుగంటి వరి పంటకు నీళ్లు పారడం లేదు. కేఎల్ఐ ద్వారా నీరు వస్తేనే పంటలు పండుతాయి. లేదంటే ఎండిపోతాయి. స్థానిక నాయకులైనా పట్టించుకొని రైతులను ఆదుకోవాలి.
– శ్రీనివాసులు, రైతు, నిజాలాపూర్, మూసాపేట మండలం
నాకున్న ఏడెకరాలతోపాటు మరో ఐదెకరాల్లో వరి సాగుచేశాను. మొత్తం రూ.2.50 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాను. చెరువుకు కేఎల్ఐ నీరు వస్తుందని ఆశించి పంటలు వేశాం. కానీ నీళ్లు రాకపోవడంతో ఎంతో కష్టపడి సాగుచేసిన పైర్లు కండ్లముందే ఎండిపోతుంటే గుండె పగులుతోంది. దిక్కుతోచని స్థితిలో కొంతైనా కాపాడుకోవాలని మరో రైతు వ్యవసాయ బోరును నెలకు రూ.19 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నా. తర్వాత ఆ బోరులో కూడా నీరు ఇంకిపోయింది. పంటకు పారదు, దిగుబడి రాదు.. సాగునీరు వస్తేనే బయటపడుతాం. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులే.. అధికారులు కేఎల్ఐ ద్వారా పెద్దవాగులోకి నీరు వదలాలి.
– గడ్డమీది గోవిందు, రైతు, నిజాలాపూర్, మూసాపేట మండలం
ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయంపై ఆసక్తి తగ్గుతున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పంట సాగు చేసే సమయానికి వానకాలం, యాసంగికి పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం పంట చేతికి వచ్చి రైతులు మళ్లీ పంట సాగు చేసినా రైతు భరోసా ఇవ్వడం లేదు. దీంతో పెట్టుబడుల కోసం ఆసాముల వద్ద మళ్లీ అప్పులు తెచ్చుకునే ప రిస్థితి నెలకొన్నది. నేను మూడు ఎకరాల్లో వరి వేశా.. ప్రస్తుతం రెండు ఎకరాలు ఎండిపోయే దశకు చేరింది. చివరి ఆయకట్టుకు నీరు అందితేనే పంట చేతికొస్తుంది. లేదంటే పోయినట్టే. సుమారు రూ.50వేల వరకు ఖర్చు చేశా. పం ట ఎండిపోతే అప్పు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.
– నాగిరెడ్డి, రైతు, కొండాపురం, గద్వాల జిల్లా