Rythu Bharosa | కొల్లాపూర్, ఫిబ్రవరి 12: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కల మారింది. ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో వారి ఖాతాల్లో జమ కావడం లేదు. తత్ఫలితంగా కొద్ది రోజులుగా రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు వ్యవసాయ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కొంతమంది రైతులకు ఎకరా పొలం ఉంటే అందులో ఒకటి కంటే ఎక్కువగా ఉన్న సర్వే నంబర్లు గల భూముల్లో కొన్ని సర్వే నంబర్లు గల రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి.
దీంతో రైతు భరోసా డబ్బులు పడని రైతులు గ్రామాలలోని రైతు వేదికల వద్ద ఏఈఓలతో ఘర్షణకు దిగుతున్నారు. బుధవారం కొల్లాపూర్ మండలంలోని చింతలపల్లి గ్రామ రైతు ఒకరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చి అధికారులను బెదిరించి వెళ్లాడు. కొంతమంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఎందుకు పడలేదో తమకు తెలిస్తే రైతులకు సమాధానం చెప్పేందుకు వస్తుంది. రైతులకు సహకరించేందుకు పనిచేసే తమపై దాడులకు దిగితే వచ్చే లాభం ఏమిటని వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఆగ్రహంతో ఉండడంతో వ్యవసాయ అధికారులు ఫీల్డ్ లెవెల్ పనుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు.