మక్తల్, జూలై 17 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు మొదలు.. చివరకు పండిన పంటను అమ్ముకునేందుకు సైతం అరిగోస పడుతున్నారు. ఈ ఏడాది వానకాలం పంటల సాగు మొదలవగా.. సరిపడా ఎరువుల నిల్వలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పైర్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి ఎరువుల అందించాల్సి ఉన్నా.. స్టాక్ లేకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి ఇలాకాలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు.
నిత్యం మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యూరియా లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. కాగా గురువారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పట్టణంలోని పీఏసీసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు పట్టా పాస్‌పుస్తకాల జిరాక్స్ కాపీలు, కవర్లను క్యూలైన్లో ఉంచారు.
1050 బస్తాలు రావడంతో కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడే పొద్దస్తమానం పడిగాపులు కాశారు. చాలా మందికి అందకపోవడంతో నిట్టూర్చుతూ వెళ్లారు. కాంగ్రెస్ పాలనలో యూరి యా కష్టాలు దాపురించాయని పలువురు ఆవేదన చెందారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో యూరియా కష్టం లేకుండా రైతులు వ్యవసాయం చేశారని గుర్తు చేసుకున్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో మళ్లా పాత రోజులు వచ్చాయన్నారు.
రేవంత్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నాట్లేసే సమయంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని దుమ్మెత్తిపోస్తున్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడుతున్నదని వాపోతున్నారు.