లింగాల, జనవరి 4 : స్థానిక పీఏసీసీఎస్ కార్యాలయం వద్దకు ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాసంగి మొదలై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పీఏసీసీఎస్ కార్యాలయంలో యూరియా అందుబాటులో ఉందన్న విషయం తెలుసుకున్న మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఒక్కసారిగా కార్యాలయానికి చేరుకోవడంతో తొపులాట జిరిగింది.
దీంతో చేసేదేమి లేక కార్యాలయ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు పోలీస్ శాఖను ఆశ్రయించక తప్పలేదు. పోలీసులు తోపులాట జరగకుండా చర్యలు తీసుకొని పంపిణీని నిర్వహించారు. ముఖ్యంగా ఒక పాసుపుస్తకానికి 3బస్తాలు యూరియా మాత్రమే ఇవ్వడంతో రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఒక పాసుపుస్తకంపై 5బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులందరికీ యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు సహనం పాటించాలని మండల వ్యవసాయాధికారి అనిల్ అన్నారు.