హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఆ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిజ్ఞలో భాగంగా లక్షలాది మంది అన్నదాతలను ఆదుకుంటున్న ఆ నగదుసాయంపై కక్షగట్టారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను విశ్లేషించినా ‘అవును’ అని స్పష్టమవుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సీజన్‌కు రూ.9వేల కోట్ల చొప్పున ఏటా రూ.18 వేల కోట్లు ఇవ్వాల్సి వస్తున్నదని, అప్పోసప్పో చేసి ఖాతాల్లో నగదు జమచేసినా.. రైతులు కేసీఆర్ పేరే తలుస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ఈ పథకాన్ని ‘దిక్కుమాలిన పథకం’ అని ఈసడించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుభరోసా బదులు పంట బోనస్‌ను తెరమీదికి తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే రైతుభరోసాను అస్తవ్యస్తం చేస్తున్నారని, ఇకపై రైతులకు ‘భరోసా’ లేనట్టేనన్న చర్చ జరుగుతున్నది.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసే క్రమంలో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. 99 రోజుల ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ నేపథ్యంలో ఇటీవల సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే రైతుభరోసా పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతులకు రెండు పర్యాయాలు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే రైతులు యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, జూన్ వస్తే వానకాలం నిధులు జమ చేయాల్సి ఉంటుందని వివరించినట్టు తెలిసింది. దీంతో వారిపై రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారని, రైతుభరోసా ఒక దికుమాలిన పథకమని, ఎవరో పెడితే దాన్ని కొనసాగిస్తున్నామని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏడాదికి రూ.18 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఉండటం లేదన్నట్టు సమాచారం.
అప్పోసప్పో చేసి తీసుకొచ్చి రూ.వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసినా ‘కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఇచ్చిండు.. ఆయన ఉన్నప్పుడు ఇట్లా వచ్చాయి’ అంటూ మాజీ సీఎం కేసీఆర్ పేరే తలుస్తున్నారని రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుభరోసా స్థానంలో రైతు పండించిన అన్ని పంటలకు పంట బోనస్ పథకాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని చెప్పారట. ఈ మేరకు ‘భరోసా వద్దు.. బోనస్ ముద్దు’ అని అనుకూల రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది
కలెక్టర్ల సమావేశం అనంతరం మంత్రులతో కూడా రైతుభరోసా అంశంపై సీఎం చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి సాయం పథకం అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి విపరీతమైన ఆర్థికభారం పడుతున్నదని, అందుకే రద్దు చేద్దామని మంత్రుల ముందు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. రైతుభరోసా వేసినా ఎవరి ఖాతాల్లో పడుతున్నాయో, ఎవరి ఖాతాల్లో పడటం లేదో అర్థం కావడం లేదని సీఎం అన్నారట.
రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారని, వారు రెండుసార్లు లబ్ధి పొందుతున్నారని చెప్పినట్టు తెలిసింది. పెట్టుబడి సాయంతోపాటు సన్న ధాన్యానికి ఇచ్చే బోనస్ కూడా వారి ఖాతాల్లో చేరుతున్నదని వివరించారట. ఇలా ఒకే రైతు రెండు రకాలుగా ప్రయోజనం పొందడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. అందుకే రైతుభరోసాను పూర్తిగా రద్దుచేసి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చించినట్టు తెలిసింది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబంధు పథకాన్ని రద్దు చేసేందుకు సర్కార్ కుట్రలు చేసింది. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషించింది. ముందుగా రైతుభరోసాను 5 ఎకరాల వరకే పరిమితం చేయాలని ప్రయత్నించింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పంటలు వేసిన భూములకే రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారని, సాగులోలేని భూములకు సైతం పెట్టుబడి సాయం ఇచ్చారంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. కోతలు పెట్టేందుకు 2024 వానకాలానికి ముందు రైతుల అభిప్రాయాలను సేకరించే పేరుతో గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించింది. మంత్రులు హెలికాప్టర్లు పెట్టుకొని మరీ అభిప్రాయ సేకరణ సభలకు హాజరయ్యారు. ఈ పేరుతో 2024 వానకాలం రైతుభరోసాను ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టింది. అప్పుడు రైతులకు నయాపైసా సాయం అందలేదు.
ఆ తర్వాత కూడా కుట్రలను కొనసాగించింది. యాసంగిలో కేవలం మూడెకరాల వరకే సాయం అందించి, మిగతా రైతులకు ఎగనామం పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. నిరుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు వానకాలానికి మాత్రమే పూర్తిగా పంపిణీ చేశారు. యాసంగిలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మళ్లీ ఎగవేతకు ప్రయత్నిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ రైతుభరోసా ఎప్పుడు వేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలా ఓ సీజన్లో ఎగవేయడం, మరో సీజన్లో సగమే జమచేయడం, నెలలపాటు ఆలస్యం చేయడం వంటి చర్యలతో రైతుభరోసాను నెమ్మదిగా రైతులు మరచిపోయేలా చేసి ఆ తర్వాత మొత్తానికే రద్దుచేసే భారీ కుట్రకు తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అలవిగానీ హామీలను ఇచ్చారు. రైతుభరోసా కింద సీజన్‌కు రూ.7,500 చొప్పున ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని రైతు డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు. ‘ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేలు మాత్రమే వస్తాయి. ఎన్నికల తర్వాత తీసుకుంటే రూ.15వేలు వస్తాయి’ అంటూ రైతులను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు.
ఆ రూ.15 వేల హామీని తుంగలో తొక్కి రూ.12 వేలకు తగ్గించారు. ఎకరాకు రూ.3వేలు కోత పెట్టారు. దీంతో రైతుభరోసా రద్దుకు అప్పటి నుంచే ఎత్తులు మొదలయ్యాయనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత సీజన్‌తో కలిపి 5 సీజన్లు గడిచాయి. వీటిల్లో ఒక్క సీజన్లోనే రైతులకు పూర్తి రైతుభరోసా అందింది. మిగిలిన నాలుగు సీజన్లలో తొలి సీజన్లో బీఆర్ఎస్ సర్కార్ జమచేసిన పైసలు పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఒక సీజన్ పూర్తిగా ఎగ్గొట్టగా, మరో సీజన్లో సగమే వేశారు. తాజా యాసంగిలో ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఆదిలాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శనివారం అంకోలీలో సంతకాల సేకరణలో మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని చెత్తపథకం అని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం మరెక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని రూపొందించి 2017 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే రైతులకు ఇబ్బందులు కలుగొద్దనే ప్రధాన ఉద్దేశంతో సీజన్ మొదలైనప్పుడే ఠంచనుగా పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. 2023 నాటికి ఏటా 70 లక్షల మంది రైతులకు మొత్తంగా రూ.80 వేల కోట్ల వరకు నేరుగా పెట్టుబడి సాయం అందించారు. ఇలా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎదురుచూడకుండా వచ్చిన పెట్టుబడి సాయం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కండ్లు కాయలుకాసేలా ఎదురుచూసినా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పంటల సాగు, నాట్ల సమయంలో వేయాల్సిన రైతుభరోసాను కోతల సమయంలోనూ వేస్తారో? లేదో? అర్థంకాని దుస్థితిలో పడేసింది.