దామరగిద్ద, ఆగస్టు 29 : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి శుక్రవారం తెల్లవారుజామునే అధికారులు వచ్చారు. ఈ విషయం తెలుసుకొని అలర్ట్ అయిన భూనిర్వాసితులు కానుకుర్తి గ్రామ శివారులోని బాపన్‌గుట్ట వద్ద ఉదయం 6 గంటలకే దాదాపు 150 మంది రైతులు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు.
అప్పటి కే అప్రమత్తమైన గడిమున్కన్పల్లి నిర్వాసితులు సైతం 120 మంది రోడ్డుపై బైఠాయించి అధికారులు సర్వేకు వెళ్లకుండా తిరగబడ్డారు. వందలాది మంది పోలీసులు రెండు ప్రాంతాలకు చేరుకున్నారు. అయినా అధికారు లు సర్వే చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తన భూమి కోల్పోతానేమోనన్న టెన్షన్లో గుండె పగిలి కానుకుర్తికి చెందిన మహిళా రైతు మల్లమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి రైతులు ఆమెను గుర్తించి దవాఖానకు తరలించారు. కానుకుర్తికి చెందిన మరో రైతు భీమప్ప ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు లాక్కోవద్దని అక్కడే ఉన్న ఓ అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు.
ఎకరాకు మార్కెట్ ధర చెల్లిస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలని కోరాడు. మా భూములు దౌర్జన్యంగా తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటానని పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ బా టిళ్లు చేత పట్టుకొని హెచ్చరించారు. దాదాపు ఐదు గంటల పాటు కదలకుండా అన్నదాతలు నిరసన తెలియజేశారు. కానుకుర్తి వద్ద నచ్చజెప్పినా రైతులు వినకపోవడంతో అనంతరం గడిమున్కన్‌పల్లిలో ఆందోళన చేస్తున్న నిర్వాసితుల వద్దకు అదనపు కలెక్టర్ సంచి త్ గంగ్వార్ వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రైతులకు ఎకరా కూ రూ.14 లక్షల చొప్పున వచ్చాయ ని, ఒక వేళ ప్రభుత్వం పరిహారం పెంచితే దానికి తగ్గట్టుగానే అంద రి రైతులకు వర్తిస్తుందన్నారు.
సర్వే అనంతరం 90 రోజులు సమయం ఉంటుందని.. సర్వే కు మీరు సహకరించాలని కోరా రు. దీంతో మాజీ సర్పంచ్ మొగులప్ప మాట్లాడుతూ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, న్యాయమైన పరిహారం అందించకపోతే ఒక తరం జీవితం నాశనం అవుతుందని వాపోయారు. మార్కెట్ వాల్యూ మేరకు పరిహారం ప్రకటించాకే భూములు సర్వే చేయాలని సూచించారు. దీంతో చేసేది లేక అదనపు కలెక్టర్‌తోపాటు సర్వే అధికారులు, పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. రాస్తారోకోలో మాజీ సర్పంచ్ బసిరెడ్డి, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, నాయకులు శీ లం నర్సిరెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.