నెట్వర్క్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 24 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక నిరాశ చెందుతున్నారు. దీంతో పలు చోట్ల రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ పీఏసీసీఎస్లో అధికారులను ఉంచిన రైతులు బయటి నుంచి తాళం వేశారు.
సిబ్బంది టోకెన్లు అందించినా.. యూరియా అయిపోయిందని చె ప్పడంతో కన్నెర్ర చేశారు. స్టాక్ లేనప్పుడు టోకెన్లు ఎందుకు ఇచ్చారని అధికారులను నిలదీశారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. స్టాక్ లేదని అధికారులు చెబుతున్నారని దుమ్మెత్తిపోశారు. పోలీసులు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద తెల్లవారుజామునే.. ఊర్కొండ రైతు ఆగ్రోస్ సెంటర్ వద్ద కర్షకులు ఎదురుచూపులు తప్పలేదు.
మహబూబ్నగర్ జిల్లా మూ సాపేట మండలం జానంపేటలో యూరి యా వచ్చిందని తెలుసుకొన్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందుగా టోకెన్లు పంపిణీ చేయడంతో అందుకునేందుకు ఎగబడ్డారు. దేవరకద్రలోనూ రైతులు తెల్లవారుజాము నుంచే నిరీక్షించారు. జడ్చర్లలోని ఎరువుల విక్రయ దుకాణాల వద్ద అన్నదాతలు క్యూకట్టారు. హన్వాడలోని పీఏసీసీఎస్ వద్ద వేకువజామున 4 గంటలకే రైతుల బారులు కనిపించాయి.