వంగూరు, ఫిబ్రవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి దళారి వ్యవస్థను రూపుమాపాలని వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మం డల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రానికి వచ్చిన యూరియా క్షణాల్లో కంప్లీట్ కా వడంతో చాలా మంది యాప్‌లో బుక్ చేసుకున్నా యూరియా అందలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు యాప్‌ల సిస్టం లేదని, అందరికీ సరిపడు యూరియా అందేదని, నేటి కాంగ్రెస్ పాలనలో నిజమైన రైతులకు యూరియా అందక పంటలను కాపాడుకోలేకపోతున్నారన్నారు. చాలా మంది చిన్న రైతులకు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో వారు యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోలేక నరకయాతన పడుతున్నారన్నారు. దీంతో ఆగ్రోస్ నిర్వాహకులు తమకు సంబంధించిన రైతులకు ముందుగానే సమాచారం ఇస్తుండటంతో సమయానికి అక్కడికి వచ్చిన రైతులకు యూరియ దొరకడం లేదన్నారు.
పెద్ద రైతులు, సాంకేతిక పరిజ్ఙానం కలిగిన రైతులు క్షణాల్లో యాప్ ద్వారా బుక్ చేసుకుని బ్లాక్‌లో యూరియాను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిజమైన రైతులను దృష్టిలో పెట్టుకుని యాప్‌ను తొలగించి వారికి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ మురళీమోహన్‌కు అందించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.