వనపర్తి, జూలై 15(నమస్తే తెలంగాణ) : గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్‌లో మునుగుతున్న భూముల పరిహారంపై దోబూచులాట కొనసాగుతుంది. తమకు బతుకుదెరువు పోతుందని, భూములు ఇచ్చేది లేదంటూ ఒకవైపు రైతులు ధర్నాలకు దిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముంపునకు గురవుతున్న భూములన్నీ నిరుపేద రైతులకు చెందినవి కావడంతో ససేమిరా అంటున్నారు. పావు, అర్ధ, ఎకరం, రెండెకరాలలో ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ భూముల్లో రెండు పంట లు పండించుకొని జీవనాధారం పొందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బుద్ధారంలో ఓట్ల కోసం వచ్చిన మేఘారెడ్డి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చెరువు కట్టను ఒక్క ఇంచు కూడా పెంచనని హామీ ఇచ్చారని, కట్ట పెంచుతామని ఎవరైనా వస్తే..20ఫీట్ల గోతి తీసి అదే చెరువుకట్టపై పాతిపెట్టాలని గ్రామంలోని రచ్చకట్ట వద్ద చెప్పారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.
చిన్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకే ఆర్భాటం చేసే ఈరోజుల్లో రూ.47కోట్ల రిజర్వాయర్ పనులను శంకుస్థాపన లేకుండానే గుట్టుచప్పుడుగా మొదలెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. 2022లో బుద్ధారం పెద్ద చెరువును రిజర్వాయర్‌గా చేయడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అప్పట్లో పనులు డీలా పడ్డాయి. అంతకు ముందే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రిజర్వాయర్ నిర్మాణ ప్రాధాన్యతను బుద్ధారం గ్రామస్తులకు వివరించారు. అలాగే నష్టపోతున్న రైతులకు ప్రత్యేకంగా లబ్ధి జరిగేలా చూ స్తామని హామీ ఇచ్చా రు. అయినా, గ్రామస్తులు తాము నిరుపేదలమని, భూ ములు పోతే తమ కు బతుకులేదని చెప్పుకున్నారు. అనంతరం ఎన్నికలు రావడం ఎమ్మెల్యేగా తూడి మేఘారెడ్డి గెలుపొందడంతో గ్రామస్తులు సంబురపడిపోయారు.
పెద్ద చెరువు శిఖంలో అప్పటికే 110 ఎకరాల మునక ఉండగా, ప్రస్తుతం కొత్త రిజర్వాయర్ ఏర్పాటుతో మరో 108 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. ఈ భూములన్నీ దాదాపు 210 నిరుపేద కుటుంబాలకు చెందినవే. 60 ఎకరాల వరకు వాల్మీకుల భూములుంటే, మరో 20 ఎకరాలు ఎస్సీలు, ఇంకో 20 ఎకరాలు ముదిరాజులకు చెందినవి కాగా,12 ఎకరాల్లో వెలమ కుటుంబాలవి ఉన్నాయి. వీరంతా అదే చెరువు నీటి ఆధారంతోపాటు బోర్ల సాయంతో రెండు పంటలు పుష్కలంగా పండిస్తున్నారు. ఈ భూముల్లో వంద వరకు బోర్లున్నట్లు అంచనా ఉంది. ఇలా వీరందరూ అర ఎకరా నుంచి 2ఎకరాలలో ఉన్న సన్న, చిన్నకారు రైతులే అయినందునా తమకు జీవనాధారం లేదంటూ ఆందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఈ రిజర్వాయర్ పనులు షురూ అయ్యాయి. గ్రామ ఎన్నికల ప్రచారంలో చెప్పిందొకటి..ఎన్నికల తర్వాత గ్రామంలో జరిగిందొకటి కావడంతో బుద్ధారం గ్రామస్తులు మనోవేదన చెందుతున్నారు. రైతులకు ఇష్టం లేకుండానే చెరువుకట్టను పెంచే పనులను చేపట్టారు. కట్ట ఒక్క ఇంచు పెంచుతామని ఎవడైనా వస్తే.. కట్టమీదనే గోతితీసి పెట్టాలన్న మేఘారెడి,్డ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం అట్టహాసం లేకుండా పనులను పురమాయించారని బుద్ధారం రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
మా భూములు ఇవ్వమంటూ గ్రామంలోనే ధర్నా చేసిన రైతులపై గోపాల్పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేయడంపై గ్రామస్తులు మరింత గుర్రుగా ఉన్నారు. ధర్నా స్థలానికి అనుకోకుండా వచ్చిన ప్రణాళికా సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అయితే, వందలాది మం ది రైతులు ధర్నా చేయగా, ఐదుగురిపై కేసు నమో దు చేయడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది లా ఉంటే, ఇటీవల కలెక్టర్‌తోపాటు భూసేకరణ అధికారులు గ్రామానికి వచ్చి పరిశీలన చేశారు. కలెక్టరేట్లో భూములు పోతున్న రైతులతో కలెక్టర్ ఆదర్శ్ సురభి సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. భూములు కోల్పోతే మాకు బతుకులేదంటూ చివరకు రూ.40 లక్షలు ఎకరాకు ఇవ్వాలని బాధతో కలెక్టర్ ముందు చెప్పుకున్నారు. డబ్బులు ఎన్ని ఇచ్చినా ఉండవని, తరాల నుంచి వచ్చినా ఈ భూములను అట్లాగే ఉంచుకుని బతుకులు వెల్లదీస్తున్నామని ఆవేదన చెందారు.
బుద్ధారం రిజర్వాయర్ ఏర్పాటు ప్రాధాన్యతను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు అప్పట్లోనే పూర్తిగా వివరించారు. మీరు నష్టపోతున్నది వాస్త వం. అందరూ చిన్న, సన్నకారు రైతులున్నది నిజం. అయితే, మీకు మూడు రెట్లు అధికంగా డబ్బులు ఇప్పి స్తా. ప్రతిఒక్కరికీ ఇళ్లు, అలాగే బ్యాంకుల నుంచి రూ. 10లక్షల ఉపాధి నిర్వహణ కోసం సబ్సిడీ రుణాలను కూడా అందిస్తా. ఇంకా దయనీయంగా ఉన్న కొంత మందికి ఔట్సోర్సింగ్ విధానంలో జీవనోపాధికి భరోసా ఇస్తానంటూ రైతులకు ఉన్నది…ఉన్నట్లుగా చెప్పేశారు. నిజం నిష్టూరం అన్నట్లుగా, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎవరిబాటన వాళ్లు ఉండిపోయారు. ఇక అదే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రామానికి వచ్చిన తూడి మేఘారెడ్డి రిజర్వాయర్ ఏర్పాటు చేసేదిలేదని, ఉన్న చెరువుతోనే పని నడిపిస్తామని మాట్లాడటంతో రైతులు ఆశల్లో పడ్డారు. పెద్దచెరువు కట్టను ఒక్క ఇంచు కూడా పెంచేది లేదని చెప్పారని, ఆ మాటలను నమ్మి ఇప్పుడు మోసపోయామని రైతులు లబోదిబోమంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎలాంటి చప్పుడు లే కుండా కాంట్రాక్టర్ చెరువుకట్టను పెంచే పనులకు శ్రీ కారం చుట్టారు. రూ.47కోట్లతో మొదలైన రిజర్వాయర్ పనుల్లో కట్ట పెంపు కోసం రూ.27 కోట్లు కాగా, మిగితా నిధులు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం కోసం నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.13 కోట్లు కట్ట పనులను పూర్తి చేయగా, రూ.3 కోట్ల వరకు బిల్లు కూ డా కాంట్రాక్టర్ తీసుకున్నాడు. మరో రూ.10 కోట్ల బిల్లు పెండింగ్ పడటంతో పనులను మధ్యలోనే నిలిపి వేశా రు. చెరువులో నీళ్లు ఉండటం వల్ల పనులు చేయడానికి రాలేదు. నీళ్లు తీస్తామంటే రైతులు అంగీకరించడం లేదు. దీంతో అర్ధాంతరంగా పనులకు బ్రేక్ పడింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు బుద్ధారానికి వచ్చిన మేఘారెడ్డి చెరువు కట్టను పెంచేదే లేదన్నాడు. నేను గెలిస్తే ఉన్న కట్టనే ఆన్లైన్ రిజర్వాయర్‌గా చేస్తా తప్పా భూములు మునగనివ్వనన్నాడు. ఒక్క ఇంచు ఎవడై నా కట్ట పెంచుతామని వస్తే…అక్కడే బొంద పెట్టాలని చెప్పిండు. ఇది రైతులు నమ్మిరు. రైతులు ఆశపడి ఆయనకు ఓట్లు వేసిండ్రు. తర్వాత మాకు తీరని నష్టమే జరుగుతుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పిన నిరంజన్‌రెడ్డిని నమ్మకపోవడం వల్ల నేడు బుద్ధారం రైతులు క్షోభను అనుభవిస్తున్నారు.
– కృష్ణయ్య, రైతు, బుద్ధారం, గోపాల్పేట మండలం
రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులందరూ చిన్న, సన్నకారు రైతులు. ప్రతి ఏటా రెండు పంటలు తీసుకొని జీవనం చేస్తున్నా రు. కుటుంబాలన్ని సర్వం కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇస్తామంటు న్న రూ.12.50 లక్షల నష్ట పరిహారం ఏమాత్రం సరిపోదు. కలెక్టర్‌కు మా బాధలు చెప్పాం. ఈ నిరుపేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. రైతులను ఆదుకోవాలి. పరిహారం పెంచాలని రైతులు ఆందోళన చేస్తే 5 మందిపై కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసం. బెదిరించాలని చూస్తే..రైతులు భయపడరు.
– శేఖర్ గౌడ్, సర్పంచ్, బుద్ధారం, గోపాల్పేట మండలం