అమరచింత, ఏప్రిల్ 15 : లక్షలు అప్పులు తెచ్చి పంట లు సాగుచేసినం.. ఇంకో 15 రోజులైతే పంటలు చేతికొస్త యి.. ఈ టైంలో నీళ్లు ఇవ్వకపోతే చేసిన అప్పులు తీర్చలేక తమకు చావే శరణ్యమని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ప్రధాన రహదారికి అడ్డంగా బారికేడ్లతోపాటు ముళ్లకంప అడ్డంగా వేసి ఎండను సైతం లెక్కచేయకుండా గంటకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 35వేల ఎకరాల్లో పంటలు సాగు చేశామని, రెండు వారాలపాటు సాగునీరు విడుదలైతేనే పంటలు గట్టెక్కుతాయని తెలిపారు. లేదంటే రూ.కోట్లల్లో నష్టం జరిగి చేసిన అప్పలు తీర్చలేక తమకు చావులే శరణ్యమని ఆందోళనలో పాల్గొన్న మస్తీపూర్, నందిమళ్ల, సింగంపేట, మూలమల్ల తదితర గ్రామాల రైతులు వాపోయారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వచ్చి హామీ ఇస్తే తప్పా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ప్రాజెక్టు రహదారిపై వందలాది వాహనాలు బారులు తీరాయి.
సమాచారం తెలుసుకున్న అమరచింత, ధరూరు పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు వనపర్తి, గద్వాల జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఇందుకు వారు తొందరలోనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో 24గంటల్లోగా సాగునీరు అందించకుంటే తమకు చావులే శరణ్యమని రైతులు హెచ్చరించి ఆందోళన విరమించారు.
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : చిట్టెం
జూరాల ఎడుమ కాల్వ ఆయకట్టు కింద వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతుల బాధను అర్థం చేసుకొని సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఈఎన్సీ అధికారి అనీల్కుమార్కు విజ్ఞప్తి చేశారు. సాగునీటి కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కాల్వల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, అయినా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. గతంలో జూరాల ప్రాజెక్టు సాగునీటి విడుదలపై ప్రత్యేకంగా ఒక అధికారి ఉండేవారని, కాంగ్రెస్ హయాం లో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.
జూరాల మోటర్ల వద్ద పడిగాపులు
అమరచింత, మస్తీపూర్, నందిమళ్ల, సింగంపేట, మూ లమాళ్ల తదితర గ్రామాల రైతులతో పాటు ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తెపల్లి, గుంటిపల్లి, మో ట్లంపల్లి తదితర గ్రామాల రైతులు సాగునీటి విడుదల కో సం రాత్రి 10గంటలు దాటినా జూరాల ఎడమ కా ల్వ మోటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యేకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మాటలు నమ్మి నీళ్లొస్తాయని వందల ఎకరాల్లో సాగుచేసి చివరికి కండ్ల ముందే పంటలు కోల్పోవాల్సివస్తుందని వాపోయారు.