అలంపూర్, ఆగస్టు 21 : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల వ్యవసాయ రుణాలను బే షరతుగా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న డిమాండ్ చేశారు. మండలంలోని లింగనవాయి కెనరా బ్యాంక్ ఎదుట బుధవారం బాధిత రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణాలు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. అలంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 395 మంది రైతులు లింగనవాయి కెనరా బ్యాంక్లో రుణాలు తీసుకున్నారన్నారు. అయితే, మూడో విడుత రుణమాఫీ జాబితాలో చాలామంది పేర్లు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రేషన్ కార్డులో పేరు లేదని, ఆధార్లో తప్పులున్నాయని, బాధిత రైతు చనిపోయాడని తదితర సాకులతో రుణాలు మాఫీ చేయడంలేదని ఆరోపించారు. ఇదిలాఉండగా, రూ.2లక్షలకు పైబడిన వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే విషయంలో అయోమయానికి గురువుతున్నారు.
రు ణమాణీకి తాము అర్హులమవుతామా లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వ్యవసాయాధికారులు, బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సుమారు వంద మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నట్లు వ్యవసాయాధికారుల లెక్కల ద్వారా తెలుస్తుందన్నారు. అయితే, బ్యాంకర్లు మాత్రం రూ.2లక్షలు వదిలేసి మిగతా రుణాలు చెల్లిస్తే మాఫీకి అర్హులవుతారని డబ్బులు కట్టించుకుంటున్నారు. కార్యక్రమంలో రైతులు నాగన్న, నాగరాజు, చైతన్య భూషన్న, రాజారెడ్డి, హన్మంతు పాల్గొన్నారు.