గద్వాల, మే 17 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూలు చేస్తున్నా ఇది సరిపోదని నిర్వాహకులు తరుగు పేరుతో క్వింటాకు రెండున్నర కేజీలు దండుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు రైతులు తెలియజేసి నా పట్టించుకోకపోవడంతో కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నది. రైతుల పరిస్థితి ఎక్కడికి వెళ్లిన కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలా తయారైంది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు ఇది కాసులు కురిపిస్తున్నాయి. రైతు పండించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి తీసుకొస్తే తరుగు పేరిట రైతులను నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది తెలిసినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పాటు ఈ విషయం మా దృష్టికి రా లేదంటూ..తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూత నిచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని భావించి వారికి కొనుగోలు సెంటర్ల నిర్వహణ బాధ్యతలు అ ప్పగించింది. దీంతో వారు ఆర్థికంగా ఎదగడానికి అ వకాశం కల్పించింది. అయితే వారి ఆర్థిక భరోసాకు కొందరు గండి కొడుతున్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు అప్పగిస్తే వారు కొనుగోలు చేయకుండా చాలా కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ పలుకుబడితో ఇతరులు నిర్వహణ చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన సమయంలో బయట పడ్డాయి.
ఈనెల 13వ తేదీ కలెక్టర్ గద్వాల మండ లం తెలుగోనిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు సెంటర్ను తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో మహిళా సంఘాలకు బదులు ఇతరులు సెం టర్ను నిర్వహణ చేస్తున్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు కేంద్రం నిర్వాహణ సరిగా లేకపోవడం, అనుమతి లేని వ్యక్తితో టాబ్లో ఎంట్రీ చేయించడం, కేం ద్రాన్ని నిర్వహించడం, రైతులకు ఎం డ నుంచి రక్షణ కోసం టెంట్ ఏర్పాటు చేయకపో వ డం, మూవ్మెంట్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అంశాలపై ఆగ్రహంచిన కలెక్టర్ వారిని సస్పెం డ్ చేయాలని ఆదేశించడంతో సంబంధిత శాఖ అధికారులు వీఏవోతోపాటు సీసీలను సస్పెండ్ చేశారు. ఏపీఎం దేవానందంకు మెమో జారీ చేశారు.
కొనుగోలు సెంటర్కు రైతులు తీసుకొచ్చిన ధా న్యం 14శాతం నుంచి 17 శాతం వరకు తేమ ఉన్నైట్లెతే ఎటువంటి తరుగు తీయకుండా రైతుల ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కొనుగోలు చేయా లి. అయితే జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ నిబంధనలు తుంగల్లో తొక్కి జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో ధాన్యం ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. అటువంటి సమయంలో ధాన్యం మంచిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ధాన్యం మంచిగా ఉన్నా అదనంగా 40కేజీల బస్తాపై కేజీ తూకం ద్వారా దండుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాను నింపి ధాన్యం తూకం వేస్తారు. సంచి బరువు 450 గ్రాము ల నుంచి 580గ్రాములు ఉంటుంది. నిబంధనల ప్రకారం 40.580గ్రాముల తూకం వేయాల్సి ఉంది. అయితే ప్రతి 40కేజీల బస్తాకు 41.600 గ్రా ముల తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతు లు అంటున్నారు. ఇలా 40 కేజీల బస్తాకు కేజీ అదనంగా తీయడం వల్ల క్వింటాకు రెండున్నర కేజీలు అదనంగా రైతుల ధాన్యం తూకం వేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతు క్వింటాకు రెండున్నర కిలోల ధాన్యం నష్టపోవాల్సి వస్తుంది.
ఇలా కొనుగోలు సెంటర్లో ఎక్కువ తూకం వేసి న ధాన్యం రికార్డుల్లో తమకు అనుకూలమైన రైతుల పేర నమోదు చేసి వాటిని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కొంతమందితో కుమ్మకై ఇలా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంత జరుగుతున్న కొనుగోలు కేం ద్రాల్లో తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహిళా సంఘాలకు కేటాయించిన సెంటర్లు పేరుకు మాత్రమే వారు నిర్వహిస్తున్నట్లు ఉంది కానీ వాస్తవంగా ఆ సెంటర్లను అధికార పార్టీ లీడర్లే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎక్కువ తూకం ఎందుకు వేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తే మీ ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంది ఇంకా ఆరబెట్టాలని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు క్వింటాలకు హమాలీ, పేరుతో రూ.50 రూపాయలు రైతుల నుంచి వసూలు చేయడంతో, రైతులు ఎటు చూసిన నష్టపోతున్నారు. పేరుకు మాత్రమే కొనుగోలు సెంటర్లు కాని సెంటర్లలో రైతులు అడుగడునా నిలువుదోపిడీకి గురవుతున్నా రు. జిల్లాలో 76 సెంటర్ల ధ్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు 41.600కేజీలు తీసుకున్నట్లు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే ధాన్యం తరలింపు విషయంలో కొంత ధాన్యం అక్కడక్కడ కింద చల్లి పోతుంటాయి అందులో భాగంగా ఒక అర కేజీ ధాన్యం తీసుకుంటున్నట్లు చావు కబురు చల్లగా రైతులకు అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. రైతులు విధి లేని పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.