మహబూబ్నగర్ కలెక్టరేట్, డిసెంబర్ 23 : మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే బయటి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో 1,99,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 84,402 మెట్రిక్ టన్నుల ధాన్యం 17,514 మంది రైతుల నుంచి సేకరించారు.
ఈ లెక్కన ధాన్యం సేకరణ కనీసం సగం లక్ష్యం కూడా చేరలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నెల చివరి నాటికే లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం 40 శాతానికిపై మాత్రమే పూర్తయ్యింది. సేకరణ పూర్తయిన ధాన్యానికి సైతం రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించలేదు. సేకరణ చేసిన రైతులకు మొత్తం రూ.195.81 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 15,217 మంది రైతులకు రూ.172.38 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 2300 మంది రైతులకు రూ.23.43 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది.
ధాన్యం కొనుగోలు చేసేందుకు 177 కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం తెరిచింది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 84,402 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. పాలమూరులో సన్న, దొడ్డు రకం ధాన్యం పండించగా రైతులు అధికంగా మధ్య దళారులు, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,320 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో గరిష్ఠంగా రూ.2,800 వరకు కొనుగోలు చేయడంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారుల వైపే మొగ్గుచూపుతున్నారు.
ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సాగుచేసిన పంట చేతికొచ్చాక కూడా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వివిధ నిబంధనలు, సాంకేతిక సమస్యలకు తోడు మిల్లర్ల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు పంట సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో రైతన్నలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తామని చెబుతున్న పాలక వర్గాలు వారం, పది, పక్షం రోజులు గడుస్తున్నా.. రైతుల ఖాతాల్లోకి ధాన్యం అమ్మిన డబ్బులు జమ చేయడం లేదని పలువురు వాపోతున్నారు. చెల్లింపుల్లో జాప్యం కారణంగా గతంలో తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేక, వానకాలం పెట్టుబడి రాక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో పాత అప్పు తీరిస్తే తప్పా మళ్లీ పెట్టుబడి కోసం ఎవరూ డబ్బు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పంటలు ఎలా సాగు చేయాలని, పెట్టుబడికి డబ్బుల్లేక రైతులేమో ఆందోళన చెందు తున్నారు.
రైతుల సమగ్ర వివరాలు అందిస్తే మరింత వేగవంతంగా చెల్లింపులు జరుగుతాయి. 48 గంటల్లో అన్నమాట వాస్తవమే. రోజువారిగా చెల్లింపులు చేస్తున్నాం. రైతులు పీపీసీ సెంటర్లలో వ్యక్తికి సంబంధించిన వివరాలు అందించడం లేదు. వారు ఆలస్యం చేయడంతో సమగ్ర వివరాలు, ధ్రువీకరణకు ఇబ్బందులు అవుతుండటంతో 78 గంటల సమయం పడుతోంది. లక్ష్యం చేరలేదంటే రైతులు వారి ఇష్టప్రకారం ధాన్యం అమ్ముకుంటున్నారు. రైతులకు ఆరబెట్టడం, తూర్పారబట్టడం వంటివి చేసేందుకు ఓపిక లేదు.. వారికి త్వరగా కావాలి. అందుకే కళ్లాల్లోనే అమ్ముకుంటున్నారు. రైతులను ఇక్కడే అమ్మాలని మేం బలవంతం చేయలేం కదా.. రైతుల ఇష్టం.
– ఇర్ఫాన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, మహబూబ్నగర్