కల్వకుర్తి, ఆగస్టు 30 : రూ.2లక్షల రుణమాఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూడు విడుతలుగా బ్యాంకుల్లో పంట రుణాలున్న రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా గడువు అయిపోయినా కనీసం 40శాతం కూడా మాఫీ కాలేదు. అర్హులందరికీ చేయలేక ఇంటింటి సర్వే చేస్తామని కొత్త నాటకానికి తెరతీశారని, అర్హులైన రైతులను గుర్తించేదెప్పుడు, రుణమాఫీ అయ్యేదెన్నడని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులు అంటే సరైన నిర్వచనమేమిటో చెప్పనేలేదు. మాములుగా భూమి సాగుచేసే ప్రతి వ్యక్తి రైతే. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, బ్యాంకులో వ్యవసాయం చే సేందుకు పంట రుణం పొందిన ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిం ది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు రుణమాఫీ చేస్తున్నామ ని ప్రకటించి మూడు విడుతలుగా చేస్తున్నామని గొప్పగా చెప్పి నా ఏ బ్యాంకులో చూసినా మాకు కాలేదంటే మాకు కాలేదం టూ రైతులు బారులుదీరిన ఘటనలే కనిపిస్తున్నాయి.
రేషన్‌కార్డు లేనివారికి, ఐటీ కడుతున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇలా రకరకాల కారణాల వల్ల 60శాతం మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణమాఫీ విషయంలో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి, మంత్రులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని, అర్హులైన రైతులను గుర్తిస్తామని కహానీలు చెబుతున్నారు. చివరకు వ్యవసాయాధికారులు రైతు కుటుంబాల సర్వే చేస్తారని, దరఖాస్తులను వ్యవసాయాధికారులకు ఇవ్వాలని ఉచిత సలహాలు ఇచ్చారు. విచిత్రమేమిటంటే రైతు నిర్ధారణ కోసం కుటుంబ సభ్యులు వివరాలు ఆధార్ నెంబర్తోసహా తీసుకోవడం విశేషం.
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు దంపతులు జనార్దన్‌రెడ్డి రూ.లక్షా 61వేలు, ఆండాలమ్మ రూ.లక్షా 61వేలు పంట రుణం ఎస్బీఐలో తీసుకున్నారు. వీరికి రేషన్‌కార్డు ఉంది. వీరికి రుణామాఫీ కాలేదు. వ్యవసాయాధికారులను అడుగగా, రూ.2లక్షలకు పైగా రుణం ఉన్నందున మాఫీ కాలేదని చెప్పారు.
రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాన్ని బ్యాంకులో చెల్లిస్తే మాఫీ అవుతుందని చెప్పారు. ఇదే విషయమై సదరు దంపతులు బ్యాంకుకు వెళ్లి చెప్పారు. అలాంటి నిబంధనలేవీ మాకు రాలేదని బ్యాంక్ అధికారులు చెప్పారు. చేసేది లేక వెనుదిరిగారు. రూ.2లక్షలకు పైగా ఉన్న రుణం మాఫీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నా రైతుల్లో నమ్మకం లేదు. ఒకవేళ రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాన్ని చెల్లించాలని చెబితే అసలే పెట్టుబడుల కాలం, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం రైతు రుణమాఫీకి పుల్‌స్టాప్ పెట్టేందుకే రైతు సర్వేకు స్వీకారం చుట్టిందని రైతు సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేసినప్పుడు ఇవేవీ అడ్డంకులు పెట్టలేదని, కాంగ్రెసోళ్లు కొర్రీలు పెట్టి రైతులను ముప్పతిప్పలతో మూడు చెరువుల నీళ్లు తాపుతున్నారని వాపోతున్నారు. రుణమాఫీ ముసుగులో రైతుబంధుకు చరమగీతం పాడారని, ఇప్పుడు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులకు ఎనలేని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పాపం ఊరికే పోదంటూ శాపనార్థాలు పెడుతున్నారు.