నాగర్కర్నూల్, ఏప్రిల్ 17 : నాగర్కర్నూల్ జిల్లాలో మక్కలు పండించిన రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం కారణంగా జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు మక్కలతో నిండిపోయాయి. దీనికితోడు గన్నీ బ్యాగులు, లారీల కొరత కారణంగా పలు మార్కెట్లో కొనుగోళ్లు మొత్తం నిలిపివేశారు. దీంతో మార్కెట్ నిండా మొక్కజొన్నలే కనిపిస్తున్నాయి. నాగర్కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రెండోరోజు సైతం రైతులకు కష్టాలు తప్పలేదు. కాంటా వేసిన మక్కను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో శుక్రవారం రైతులు మార్కెట్కు తెచ్చిన ధాన్యం ఎక్కడ దింపాలో తెలియకుండా ఆందోళనకు గురయ్యారు. దీంతో ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు మార్కెట్ బయట నెల్లికొండ చౌరస్తా వరకు బారులుతీరి కనిపించాయి. వారం రోజులుగా తెచ్చిన మక్కను కొనుగోలు చేయకపోవడం, కాంటా చేసిన ధాన్యాన్ని తరలించకపోవడం, లారీలో తరలించే వరకు రైతులదే బాధ్యత చేయడంతో రోజుల తరబడిగా మార్కెట్లలో అన్నదాతలకు పడిగాపులు తప్పడం లేదు. చేసేది లేక చాలా మంది రైతులు వారి ఇండ్ల నుంచి భోజనం తెప్పించుకొని కాంటా చేసిన మక్క సంచుల వద్ద భోజనం చేస్తూ పడిగాపులు కాస్తున్నారు.
కాగా మార్కెట్కు వచ్చిన రైతులు గన్నీ బ్యాగులకోసం ఎగబడ్డారు. అవికూడా అరకొరగా పంపిణీ చేయడం, అన్నదాతలు ఒక్కసారిగా ఎగబడడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ఏదేమైనా రైతు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం, అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కనీసం గన్నీ బ్యాగుల తెప్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో మక్కలు పోసేందుకు స్థలం లేదని చెప్పిన అధికారులు కాంటా చేసిన ధాన్యాన్ని సైతం తరలించే విషయంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో అకాల వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.