జడ్చర్ల, అక్టోబర్ 3 : ఆరుగాలం కష్టిం చి పండించిన పంట కళ్లముందే వర్షార్ప ణం కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. జడ్చర్లలో గురువారం మధ్యా హ్నం కురిసిన భారీ వర్షానికి బాదేపల్లి వ్య వసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న మొక్కజొన్న పూర్తిగా తడిసోయింది. వర్షపునీటి ప్రవాహానికి మొక్కజొన్న కుప్పలు, ఆరబెట్టిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
మార్కెట్కు గురువారం 6,689 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి వచ్చింది. టెండ ర్లు పూర్తయ్యాక వర్షం కురిసింది. దీంతో ఆరుబయట ఉన్న మొక్కజొన్న కుప్పలతోపాటు ఆరబెట్టిన మొక్కజొన్న వర్షపునీటిలో కొట్టుకుపోయింది.రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపుగా 3వేల బస్తాల మొక్కజొన్న తడిసిపోయి ఉంటుందని వ్యాపారవర్గాలు తెలిపాయి. మిడ్జిల్ మండలానికి చెందిన రైతు గోపాల్ రెండు ట్రాక్టర్లలో మొక్కజొన్న తీసుకొచ్చి ఆరబెట్టగా, వర్షానికి కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. ఇందుకు రూ.60వేలకు పైగా ఖర్చయ్యింది. ధాన్యం అమ్ముకుందామని బాదేపల్లి మార్కెట్కు ట్రాక్టర్లో తీసుకొచ్చా. వర్షం కురవడంతో సగం కొట్టుకుపోయింది. అప్పు చేసి పంట పండిస్తే నీటిపాలైంది. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థకావడం లేదు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి.
– గోపాల్, రైతు, వేముల, మిడ్జిల్ మండలం
బాదేపల్లి మార్కెట్కు 6 ట్రాక్టర్లలో మొక్కజొన్న అమ్మకానికి తీసుకొచ్చాం. వర్షానికి మొత్తం తడిసిపోయింది. తడిసిన మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేయరు. ప్రభుత్వం స్పందించి తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేసి ఆదుకోవాలి
– చాంది, మహిళా రైతు, ఇప్పలపల్లి చెన్నలగడ్డతండా, తిమ్మాజిపేట మండలం