గద్వాల, నవంబర్ 11 : ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు సాగు చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూసారు. అయి నా వ్యవసాయంపై రైతన్నకు ఆశ చావలేదు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగి పంటలకు సన్నద్ధమ వుతున్నాడు.
వానకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని రైతులు వాన కాలం సాగుపై గంపెడు ఆశలు పెట్టుకోగా అది కన్నీరు మిగిల్చింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అధిక వర్షాలు పంటల ఎదుగుదలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా పత్తి, మిరపపై తెగుళ్ల ప్రభావం పడింది. ఈ పంటలకు విపరీతమైన తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి సగానికి తగ్గిపోయింది. వర్షం ప్రభావం ఇతర పంటలపై పడడం తో రైతులకు వానకాలం సాగు నష్టాలను మిగిల్చింది.
నష్టాల నుంచి గట్టెక్కడానికి.. యాసంగి సాగుకు సన్నద్ధం
వానకాలం సాగు ఎలాగో నష్టాలు మిగిల్చింది. యా సంగి సాగు కలిసి వస్తుందనే ఆశతో రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 1.95లక్షల ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేస్తారని వీటికి 38,763 క్వింటాళ్ల విత్తనాలు, 40,354 మెట్రిక్ టన్ను ల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. యాసంగి అవసరమైన ఎరు వులు, విత్తనాలు అధికారులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మా ర్కెట్లో విత్తనాలు అందుబాటులో ఉండగా, మార్క్ఫెడ్ వారు ఎరువులు సిద్ధం చేస్తున్నారు. వానకాలం పంటలు కోతలకు వచ్చిన భూముల్లో పనులు ప్రారంభి ంచారు రైతులు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండడంతో యాసంగి పంటలకు ఎటువంటి ఢోకా లేదు.
అయితే తుంగభద్ర గేట్లు మరమ్మతుల కారణంగా ఈ యాసంగిలో ఆర్డీఎస్ పరిధిలో క్రాఫ్ హాలీడే ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక నీటిపారు దల శాఖ అధికారులు సమావేశమై క్రాఫ్ హాలీడేపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇది ఆర్డీఎస్ రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఎలాగో వానకాలం కలిసి రాలేదు యాసంగిలోనైనా పంట లు సాగు చేసి ఆర్థికంగా బలోపేతం అవుదామ నుకుంటే అధికారులు క్రాఫ్హాలిడే అంటూ పిడుగులాంటి వార్త చెప్పడంతో రైతులు నిరాశకు లోనయ్యారు. అయితే బోర్లు, బావుల్లో నీరు పుష్క లంగా ఉండడంతో రైతులు వాటి కింద పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించు కుంటున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 1.95లక్షల ఎకరాల్లో సాగు..
ఈ ఏడాది జిల్లాలో యాసంగి సాగు 1,95,516 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరి 85,529, మొక్కజొన్న 53,452, జొన్న 13,870, పప్పుశనగ 12,023, వేరుశ నగ11,612, పొగాకు 8,690, మినుములు 4,323, అలసందలు 25,88, కంది 1320, కొర్రలు 372, ఆముదాలు 376, ఇతర పంటలు 181 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాన కాలం సీజన్ రైతులకు ఎలాగో కలిసి రాలేదు, ఈ యాసంగి సీజన్ అయినా కలిసి వస్తుందనే ఆశతో సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. యాసంగి తమకు కలిసి వచ్చి ఆదాయం తెచ్చి పెడుతుందనే ఆశతో సాగుకు ముందుకు సాగుతున్నారు.
పేటలో 1.70 లక్షల ఎకరాల్లో..
నారాయణపేట, నవంబర్ 11 : జిల్లాలో ఈ యాసంగి సీజన్లో రైతులు అత్యధికంగా వరి పంట వేసేందుకే మొగ్గుచూపుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లక్షా 70వేల ఎకరాల్లో వరి పంట వేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 8వేల ఎకరాలలో వేరుశనగ, 14వందల ఎకరాలలో జొన్న, 800 ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రైతులు కోటి ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు.
కందనూలులో ప్యాడీకే ప్రాధాన్యం
నాగర్కర్నూల్, నవంబర్ 11: నాగర్కర్నూల్ జిల్లాలో 2025-26 యాసంగి సాగు అంచనాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,59,616 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేయనున్నట్లు తెలిపారు. వరి 1,82,480 ఎకరాల్లో, వేరుశనగ 1,32,087 ఎకరాల్లో, మొక్కజొన్న 1,07,695 ఎకరాల్లో, జొన్నలు 2,568 ఎకరాల్లో, మినుములు 20,856 ఎకరాల్లో, ఇతర పంటలు 13,930 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా వేశామన్నారు. ఇందుకోసం 2,15,068 క్వింటాళ్ల అన్ని రకాల విత్తనాలు, 90,907 క్వింటాళ్ల ఎరవులు అవసరం అవుతాయని గుర్తించామన్నారు.
పాలమూరు జిల్లాలో వరికే ..
పాలమూరు, నవంబర్ 11 : మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు దాదాపు 2,37,259 ఎకరాల్లో రకరకాల పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 10,100 ఎకరాలు, జొన్నలు 1,064 ఎకరాలలో, మొక్కజొన్న 19,388 ఎకరాల్లో, రాగులు 215 ఎకరాలు, ఆముదాలు 252 ఎకరాలు, వేరుశనగ 15340 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడంతో పంటలపై రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు.