రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో సంబురాలు అంబరాన్నంటాయి. పల్లెపల్లెన.. వాడవాడన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పంటపొలాల్లో డప్పులు కొడుతూ.. గులాలు చల్లుకుంటూ.. పటాకులు కాలుస్తూ.. స్వీట్లు పంచుకొని సందడి చేశారు. అచ్చంపేటలో విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గువ్వల ట్రాక్టర్ నడిపారు. గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మరికల్, ధన్వాడలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, భూత్పూరులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం సమీపంలో వరి పొలంలో జై కేసీఆర్ అంటూ వరి నాట్ల ప్రదర్శనతో రైతులు, కూలీలు సంబురాలు చేసుకున్నా రు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి శివారులో వరి పొలంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు డప్పుల మోత మధ్య డ్యాన్స్ చేశారు.
మహబూబ్‌నగర్, అగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రూ.లక్షలోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో అనందం వెల్లివిరుస్తున్నది. ముఖ్యమంత్రి ప్రకటన వెలువడగానే రైతులు రోడ్లపైకి వచ్చి సంబురాల్లో మునిగిపోయారు. గురువారం ఐదు జిల్లాల్లోని మండలాల్లో రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి పటాకాలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. వనపర్తి జిల్లా బుద్ధారం శివారులో వరి నాట్లతో కేసీఆర్.. రుణమాఫీ అంటూ ప్రదర్శన నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గువ్వల ట్రాక్టర్ నడిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట జిల్లా మరికల్, ధన్వాడలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, భూత్పూరులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్, ఆత్మకూరు, కృష్ణ, మాగనూరు, ఊట్కూరులో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం సమీపంలోని వరి పొలంలో జై కేసీఆర్ అంటూ వరి నాట్ల ప్రదర్శనతో రైతులు, కూలీలు సంబురాలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ సమీపంలోని ఓబులాయపల్లి శివారులోని వరి పొలంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు డప్పుల మోత మధ్య డ్యాన్స్ చేశారు. గులాబీ రంగును చల్లుకుంటూ నాట్లు పట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సోదరుల్లో ఫుల్ జోష్ నెలకొన్నది. కేసీఆర్ జిందాబాద్.. రైతుబాంధవుడు కేసీఆర్ అంటూ నినదించారు. అయితే ఐదేండ్ల నుంచి పంట పెట్టుబడికి రైతుబంధు సాయం అందుతుండడంతో చాలామందికి రుణాల అవసరం లేకుండాపోయింది. కేసీఆర్‌కు రుణపడి ఉంటామని.. మళ్లీ కేసీఆరే సీఎం అంటూ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రక్రియ మొదలైంది..
రుణమాఫీ ప్రక్రియ మొదలైంది దశల వారీగా మాఫీ కానుండడంతో ఆయా బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాల లెక్కలు తీస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 86,436 మందికిగానూ రూ.367 కోట్లు,
నారాయణపేట జిల్లాలో 97,635 మందికిగానూ రూ.773.37 కోట్లు, వనపర్తి జిల్లాలో 79,150 మందికిగానూ రూ.659.72 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,56,662 మందికిగానూ రూ.720.84 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,05,715 మందికిగానూ రూ.726.33 కోట్లు మాఫీ కానున్నట్లు అంచనా. గతంలో రూ.25 వేల వరకు రుణాలు మాఫీ చేయగా.. ప్రస్తుతం రూ.లక్ష వరకు మాఫీ కానున్నది. చిన్నసన్నకారు రైతులే అధికంగా రుణాలు తీసుకున్నారు. ఇకపై ఈ భారాన్ని ప్రభుత్వమే భరించనుండడంతో రైతులు ఆనందంలో అవధుల్లేకుండాపోయాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శాసనసభ, ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. లీడ్ బ్యాంకు అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 5,25,598 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు అంచనా.. జిల్లాల వారీగా లెక్కలు తీసి ఏ బ్యాంకుల్లో ఎంత అప్పు తీసుకున్నారో.. వివరాలు సేకరించి ప్రభుత్వానికి
పంపించారు.
రైతులే బీఆర్ఎస్ను గెలిపిస్తారు
అచ్చంపేట, ఆగస్టు 3: అచ్చంపేటలో కాంగ్రెస్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు సాగనివ్వమని, మూడోసారి రైతులే బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత తీసుకుంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం సాయంత్రం అచ్చంపేటలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంకావడంతో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం నుంచి విప్ గువ్వల ట్రాక్టర్లో ఊరేగింపుగా పర్యటించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం రైతులు ఆత్మగౌరవంతో జీవిస్తారన్నారు. అచ్చంపేటలో పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని.. ఇక ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఓటమిలో హ్యాట్రిక్ సాధిస్తున్న వ్యక్తి ఈసారి ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో గెలవాలని అనేక కుట్రలు, కుతంత్రాలు, డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి ఓడిపోతే బతకలేమని చిల్లర సెంటిమెంట్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. రుణమాఫీ ప్రకటనతో కాం గ్రెస్‌కు ఉన్న దింపుడు గల్లెం ఆశలు కూడా గల్లంతయ్యాయని.. కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ను ముఖ్యమ ంత్రి కుర్చీలో కూర్చోబెడతామని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మార్కెట్ చైర్పర్సన్ అరుణ, నాయకులు శ్రీనివాసులు, రాంబాబు, అమినోద్దీన్, పర్వతాలు, రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
గద్వాల, ఆగస్టు 3 : రాష్ట్రంలో రైతురాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రుణమాఫీ చేశారని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో వారం వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం రూ.19 వేల కోట్లను మాఫీ కోసం కేటాయించిందన్నారు. రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. దీంతో పలువురు రైతులు సొంతూళ్లను వదిలి దూర ప్రాంతాలకు వలస వెళ్లారని, మరికొందరు వ్యవసాయాన్ని వదిలి ఇతర పనులు చేశారన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయ్యిందన్నారు. వ్యవసాయానికి, సాగునీటి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దీంతో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు తిరిగొచ్చి పండుగలా సాగు చేస్తున్నారని తెలిపారు. రైతుల మో ములో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్న య్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, నరహరిగౌడ్, మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారిణి పుష్పమ్మ పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 3 : రైతు నేస్తం.. సీఎం కేసీఆర్ అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీని ప్రకటించడంతో గురువారం పట్టణంలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మున్సిపల్ చైర్మన్ సత్తూరు బస్వరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో పాలు ఎమ్మెల్యే ఆల క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో ప్రపంచ మంతా ఆర్థికంగా అతలాకుతలమైనా.. ఆర్థిక సంక్షోభం తలెత్తినా మాత్రం సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బందు లకు గురిచేసినా సీఎం కేసీఆర్ ప్రజల వెన్నంటే నిలిచారని గుర్తు చేశారు. నేడు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అన్నదాతలకు ఇంతలా చేస్తున్న ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకోవడం రైతు బాధ్యత అన్నారు. స్వర్ణా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, ముడా డైరెక్టర్ సాయిలు, వైస్ ఎంపీపీ నరేశ్‌గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మరికల్/ధన్వాడ, ఆగస్టు 3 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రకటించినందుకు గురువారం మరికల్‌లోని చౌరస్తా వద్ద, ధన్వాడలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ సీఎం రైతుల గురించి ఆలోచించలేదని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ రుణమాఫీ చేశారని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్, రైతుబీమా, రైతుబంధు, అందుబాటులో ఎరువులు.. ఇలా ఎన్నో పథకాలను కర్షకుల కోసం అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ చేతకాని ప్రభుత్వమన్నారు. పాలమూరుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గుజరాత్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించారని, కానీ ఇక్కడి ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణపై కపట ప్రేమ చూపుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ గోపాల్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు మతీన్, రైతులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఆగస్టు 3 : రైతుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని హైవే-167పై ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ నేడు రుణమాఫీ చేశారన్నారు. తెలంగాణలో అన్నదాతలు చాలా సంతోషంగా ఉన్నారని, వ్యవసాయం పండుగలా జరుగుతుండడంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయని తెలిపారు. కేంద్రం నోట్లను రద్దు చేయడం.. కరోనా విపత్కర పరిస్థితులతో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, ఈ క్రమంలో రుణమాఫీ అమలు చేయడంలో ఆలస్యం జరిగిందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను మోదీ సర్కారు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దని, వెన్నంటే నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సీనియర్ నేత శ్రీనివాస్‌గుప్తా, నాయకులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
నాగర్‌కర్నూ, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రైతు రుణమాఫీ ప్రటకన చేయడంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ అంతటా జలకళ సంతరించుకుంది. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రైతుల సంక్షేమం కోసం ఎళ్లవేళలా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞలు.
– రామలు, ఎంపీ, నాగర్‌కర్నూల్
రైతు రుణమాఫీ హర్షణీయం
ఉప్పునుంతల, ఆగస్టు 3: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ చేయాలని ఆదేశించడం హర్షణీయం. సహసమైన నిర్ణయం తీసుకొని రైతు పక్షపతిగా మరోమారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచారు. రైతును రారాజును చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతు రుణమాఫీ ప్రకటించడం సంతోషం. ప్రతిఒక్క రైతు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి.
– ఆలూరి వెంకటేశ్, రైతు,ఉప్పునుంతల
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
రైతుల పంట రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేయడం సంతోషకరం. పంటలు పండించేందుకు ఇన్నాళ్లు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారు. అలాగే రుణమాఫీ చేసి అండగా నిలిచారు. పంట రుణాలను మాఫీ చేసిన సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు.
– శ్రీనువాస్‌రెడ్డి మాజీ ఆదర్శరైతు ఎత్తం.
రైతులకు ఎంతో మేలు
పంటరుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్నికల వేల ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. నెలన్నర రోజుల్లో రుణాలను మాఫీ చేయాలని ఆదేశించిన సీఎం కేసీర్గారికి ధన్యవాదాలు. తెలంగాణలో రైతులంతా సంతోషంగా ఉన్నాం.
– అంజన్‌గౌడ్, రైతు, ముత్తిరెడ్డిపల్లి
రైతు శ్రేయస్సే కేసీఆర్ ధ్యేయం
తెలంగాణలో రైతుల శ్రేయస్సుకోసం పాటుపడే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాలను రూ.లక్షలోపు మాఫీ అమలుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ఇన్ని పథకాలను అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. రైతులకు రుణమాఫీ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– మధుసూదన్‌రెడ్డి, మాజీ ఆదర్శ రైతు కోడేరు