గట్టు, జూలై 20 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం అయోమయంగా మారింది. ఒకవైపు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశామని, రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశామని ప్రభుత్వం చెబుతుండగా మరోవైపు రూ.లక్షలోపు రుణం ఉన్న రైతులు త మకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఎవరూ రై తులకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. గట్టు మండలంలో పీఏసీసీఎస్ కార్యాలయం ఒక్కటే ఉన్నది. దీంట్లో పంట రుణాలు తీసుకున్న రైతులు 824మంది ఉన్నారు.
ఈ క్రమంలో రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులు 706మంది ఉన్నారు. వీరిలో రూ.1.50లక్షలలోపు రుణం తీసుకున్న వారు 72మంది ఉండగా, రూ.2లక్షలలోపు 23మంది, రూ.2లక్షలకుపైగా రుణాలు తీసుకున్న రైతులు మరో 23మంది ఉన్నారు. కాగా రూ.లక్షలోపు రుణం తీసుకున్న వారు 706మందిలో కే వలం 282మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 424మంది రైతులు రుణమాఫీ కాక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గట్టు ఎస్బీఐ, మాచర్ల ఆంధ్రాబ్యాంక్, సింధనూన్ ఏపీజీవీబీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. గందరగోళంగా ఉందని రైతులు వాపోతున్నారు.