UREA | కొల్లాపూర్, ఫిబ్రవరి 20: ఆరుకాలం కష్టపడే రైతుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. రుణమాఫీనే మాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసాకు పాతర వేసింది. వ్యవసాయం తప్ప మరో పని తెలియని రైతు యాసంగి పంటల సాగుకు సొంత పెట్టుబడితో సిద్ధమైనా ఎరువుల కొరతను సృష్టించి సాగుకు దూరం చేసేందుకు కుట్ర పన్నింది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సాగు కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో మళ్లీ యూరియా కొరతతో మరింత సాగు భారంగా మారింది.
మండలంలోని 13 గ్రామాల్లో 27,962. 22 గుంటల భూమికి పాస్ పుస్తకాలు ఉన్నాయి.ఇందులో ఇప్పటికే సర్వే పేరుతో 485.15 ఎకరాల భూమికి రైతు భరోసా రాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలిసింది. మండలంలో రైతులు దాదాపు 40 వేల ఎకరాల భూమి వరకు వాన కాలం పంట సాగు చేశారు. వేసంగిలో 35,000 ఎకరాల వరకు సాగు చేయడానికి రైతులు సిద్ధం అయ్యారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం అధికారికంగా వరి 7000 ఎకరాలలో, వేరుశనగ 20 ఎకరాలలో, మొక్కజొన్న వెయ్యి ఎకరాలలో యాసంగి పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారుల లెక్కల ప్రకారం గురువారం నాటికి 195 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. కానీ 296 మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. యాసంగి పంటలకు ఎంత మోతాదులో ఎరువులు అవసరం ఉంటాయో ముందస్తుగా అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు వెళుతూ ఉంటాయి. ప్రభుత్వానికి వ్యవసాయంపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే యాసంగి పంటలపై ఎరువుల ప్రభావం స్పష్టంగా కనబడుతుంది.
రైతు భరోసా డబ్బులు రాక దళారుల వద్ద అప్పులు తెచ్చుకుని యాసంగిలో పంటలను సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ఆరాటపడుతున్నారు. యూరియా డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు యూరియా కోసం షాపుల ముందు బారులు తీరుతున్నారు. కోడేరు మండల కేంద్రంలో సొసైటీకి యూరియా వచ్చిందని విషయం తెలియగానే రైతులు సింగిల్ విండో సొసైటీ తెరవక ముందుకే బారులు కట్టారు. యూరియా కోసం రైతులు మినీ యుద్ధమే చేయవలసి వచ్చింది. దీంతో ఇదే అదునుగా ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణం దారులు రూ.270 బస్తాను రూ.300/350 వరకు ధరలకు పెంచి విక్రయిస్తున్నారు. ఎరువులను కొనుగోలు చేయలేక పంటల సాగును మానుకోవడం ఉత్తమమని రైతులు వాపోతున్నారు.
శేఖర్ అనే రైతు మాట్లాడుతూ .. ‘కోడేరు శివారులో 5 ఎకరాలలో యాసంగి పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నాను. యూరియా అందుబాటులో లేదు. యూరియా కొరతవల్ల అవస్థలు పడుతున్నాం. సింగిల్ విండో సొసైటీలో యూరియా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేసి పంటలు నష్టపోకుండా కాపాడాలి’ అని కోరారు.