“వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ గ్రామ సరిహద్దులోని శ్రేయకు రెండెకరాల భూమి ఉన్నది. ప్రభుత్వం
నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేశామని ప్రకటనల నేపథ్యంలో
తనకు బ్యాంకు నుంచి మెసేజ్ రాలేదేమోనన్న ఉద్దేశంతో వెళ్లి బ్యాంక్ అధికారులను వాకబు చేసింది. రైతు
భరోసా డబ్బులు జమకాలేదని తెలుసుకున్నది. వెంటనే అక్కడ నుంచి నేరుగా వ్యవసాయాధికారిని కలిసి
రైతుభరోసా సాయం అందలేదని వారి దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో వ్యవసాయాధికారి తన వద్ద ఉన్న సైట్లో చెక్ చేశాడు. విషయం ఏమిటంటే సదరు భూమిలో పంట సాగు చేయలేదు.. అందుకే ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఇవ్వలేదని చావుకబురు చల్లగా చెప్పాడు. ఐదారేండ్లుగా పంట సాగుచేస్తున్నాం. పంట దిగుబడి రావడం లేదనే ఈ ఏడాది పంట సాగు చేయలేదు. పెట్టుబడి సాయం ఇవ్వడం చాతకాక రైతుభరోసాకు ఎగనామం పెట్టారని ఆమె గొనుక్కుంటూ వెళ్లిపోయింది.” ఇది కేవలం శ్రేయకు జరిగిన అన్యాయమే కాదు.. ఇలాంటి బాధిత రైతులు ఎందరో ఉన్నారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 23 : నాలుగెకరాల వరకు రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం చెబుతుండగా.. చాలా మంది రైతులు మాకు ఎకరానికి మాత్రమే వచ్చింది.. రెండెకరాలకు మాత్రమే వచ్చింది.. అంటూ ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయాధికారుల వద్దకు వెళ్తే అసలు విషయం అర్థమవుతుంది. నాలుగెకరాల రైతు రెండెకరాల్లో మాత్రమే పంట సాగు చేస్తే రెండెకరాలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది.
సాగుచేయని మిగితా రెండెకరాలకు సాయం ఇవ్వలేదు. సాగు చేయకుంటే రైతు భరోసా ఇవ్వమనడంలో చాలా తిరకాసు ఉన్నది. ఉదాహరణగా 216 సర్వే నెంబర్లో 18ఎకరాల భూమి ఆరుగురు రైతుల పేరుపై ఉన్నది. ఎవరో ఒక రైతు పంట వేయకుంటే ఈ సర్వే నెంబర్లోని మిగితా రైతులు ఏ దిశన పంట వేసుకున్నాడనే విషయం వ్యవసాయాధికారులకు అర్థంగాక మొత్తం భూమి పడావ్లో ఉన్నదని రాస్తున్నారు. దీంతో ఆరుగురికి భరోసా అందలేదని ఆందోళన చెందుతున్నారు.
గ్రామాలలో పనిచేసే వ్యవసాయ విస్తరణాధికారులు రైతులు వేసిన పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు వేశాడు.. అనే విషయాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తుంటారు. రైతులను అడగటం లేదా క్షేత్ర పర్యటన చేసి వివరాలు నమోదు చేసుకుంటారు. కొంత సమాచారం అటుఇటైనా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏఈవోలు అదే విధంగా సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. ఇదే కొందరు రైతులకు రైతు భరోసా రాకుండా చేసింది. చాలా మంది రైతుల పొలాలు పడావులో ఉన్నట్లు రికార్డులలో నమోదు చేశారు. దీం తో రైతు భరోసా రాని చాలా మంది కర్షకులు వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేస్తూ తమకు ఎందు కు రైతు భరోసా రాలేదని అధికారులను నిలదీస్తున్నారు. దీంతో అ ధికారులు తలలు బాదుకుంటున్నారు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ అధికారుల పరిస్థితి తయారైంది.
రైతుబంధు పేరును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికింది. అధికారంలోకి రాగానే గరిష్ఠంగా ఎన్ని ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాలనే అంశంపై మంత్రులతో కమిటీ వేసింది. కమిటీ పుణ్యమాని వానకాలానికి రైతు భరోసా ఎగ్గొట్టింది.
మల్లగుల్లాలు పడి గరిష్ఠం అంటూ ఏమీలేదు.. సాగుకు యో గ్యం కాని భూములకు(వెంచర్లు, గుట్టలు, ఫౌల్ట్రీపాం) రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాకపోతే భరోసా నిబంధనల్లో మాత్రం సాగుచేయని భూములకు వర్తించదన్న నిబంధనను ఉంచారు. ఎలాగంటే సిగరేట్ డబ్బాపైన పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరమన్న చిన్న అక్షరాలతో ముద్రించినట్లు.
సాధారణంగా రైతులు తమకు ఉన్న వ్యవసాయ భూమిని ఒకేసారి సాగు చేయడన్నది జగమెరిగిన సత్యం. ఉదాహరణగా రైతుకు 6 ఎకరాల వ్యవసాయ పొలం ఉంటే.. మూడెకరాల్లో ఒక పంట, మరో మూడెకరాల్లో మరోపంట సాగు చేస్తాడు. లేదా మూడెకరాల్లో ఒక పంట సాగు చేసి, మూడెకరాలను పడావు ఉంచుతాడు. వచ్చే పంటకు పడావు ఉన్న భూమిని సాగు చేస్తాడు. వెంట వెంట పంటలే సాగు చేస్తే దిగుబడి రాదనే ఉద్దేంతో ఇలా చేస్తారు. కేవలం సాగు చేసిన పొలానికి రైతుభరోసా ఇస్తే.. ప్రభుత్వం ఇచ్చే రైతు పెట్టే పెట్టుబడికి ఏమూలకు సరిపోదని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
ఏ పంట సాగు చేసినా ఎకరానికి తక్కువ తక్కువలో రూ.25 వేలకు పైగానే ఖర్చు అవుతున్నది. వరి విషయానికి వస్తే నాటడానికి రూ.6 నుంచి రూ.7 వేలు.. కోయడానికి రూ.3 వేలకుపైగానే.. కలుపు తీయడానికి రూ.2 వేలకు పైగానే.. కరిగెట చే యడానికి దాదాపుగా రూ.6 నుంచి రూ.7 వేల వరకు.. ఎరువుల బస్తాలు రూ.6 వేల నుంచి రూ.8 వేలు..పిచికారి మ ందు లు రూ.3 వేలకుపై ఖర్చు అవుతున్నది. వాణిజ్య పంటలకు అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతున్నది. ప్రభుత్వం భరోసా కింద ఇస్తుంది కేవలం రూ.6 వేలే.. అది కూడా సాగు చేస్తేనే.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం గురించి తీవ్రంగా ఆలోచించి రైతులకు కాస్తంతైనా అండగా ఉండేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ పొలం ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు వేయాలని నిర్ణయం తీసుకొని క్రమం తప్పకుండా వారి ఖాతాలలో జమచేసింది. సాయం పూర్తి స్థాయిలో రావడంతో రైతులకు పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కోతలు, కొర్రీలు లేకపోవడంతో రైతుబంధు వస్తాదా? రాదా? అన్న అలోచన కూడా రైతులకు వచ్చేది కాదు. కాంగ్రెస్ ప్ర భు త్వం అధికారంలోకి వచ్చాక రైతుభరోసా వస్తాదా..? రాదా? అన్న అనుమానం ప్రతి రోజు కలుగుతున్నది. ఎప్పుడు ఏం కొర్రీలు పెట్టి ఎగ్గొడతారనే భయం రైతుల్లో వ్యక్తమవుతున్నది.
సాగు చేయకుంటే రైతుభరోసా రాకపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎన్నికల ముందు ఎందుకు ఈ నిబంధన గురించి చెప్పలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘ఏరు దాటకు ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’.. అన్నట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన చెందుతున్నారు. పాలిచ్చే బర్రెను వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు తమ పరిస్థితి తయారైందని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ బాటలోనే రైతు భరోసాను తీసుకెళ్తున్నారని రుణమాఫీ లాగే రైతు భరోసా కూడా మమ అనిపిస్తారని రేవంత్ సర్కార్‌పై అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 3,22,724 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరి ఆధీనంలో 7,59,793 భూమి ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున యాసంగికి రూ.379.90 కోట్లు, వానకాలానికి రూ.379.90 కోట్లు రైతుల ఖాతాలలో క్రమం తప్పకుండా జమ చేసేది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని, పెట్టుబడి సాయంగా రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది.
తీరా అధికారంలోకి వచ్చాక రైతు భరోసా అమలు కోసం కమిటీలు వేసింది. వీటిలో కాలయాపనలో వానకాలం రైతు భరోసాకు మంగళం పాడింది. చివరకు యాసంగి నుంచి రూ.15 వేలు కాకుండా రూ.12వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగికి ఎకరాకూ రూ.6 వేల చొప్పున జనవరి 26 రైతుల ఖాతాలలో వేస్తామని ప్రకటించింది. ఆ గడువుకు కూడా మూడే నెలలు కావస్తున్నది. విషయానికొస్తే జిల్లాలో యాసంగికి రైతుల ఖాతాలలో రూ.6 చొప్పున రూ.455.87 కోట్లు ప్రభుత్వం జమచేయాల్సి ఉన్నది.
ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగెకరాల వరకు రైతుల ఖాతాలలో రైతుభరోసా డబ్బులు జమచేశామని చెబుతున్నా 4 ఎకరాల వరకు భూమి ఉన్న చాలా మంది రైతు ఖాతాలలో డబ్బులు కాలేదని తెలుసుతన్నది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. సాగుచేయని పొలాలకు రైతుభరోసా డబ్బులు వేయలేదని తెలుస్తున్నది. చా లా చోట్ల వ్యవసాయాధికారులు, క్షేత్ర పర్యటన చేయకుండా కేవలం రైతులు ఇచ్చిన సమాచారంతో పంటల వివరాలు రికార్డులలో నమోదు చేశారు. చాలా మంది రైతుల పొలాలలో పంటలు సాగు చేయలేదని రికార్డులలో నమోదు చేశారు. ఇది ఇప్పుడు రైతులకు శాపంగా మారింది.
రుణమాఫీ విషయంలో కూడా ఇలా తిప్పి తిప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి, మంత్రులు రకరకాల జమ్మిక్కులు చేశారని, చివరకు రుణమాఫీకి మంగ ళం పాడారని రైతులు అంటున్నారు. ఇప్పుడు అదే బాటలో రైతు భరోసా కూడా పయనిస్తుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాకు ఆఖరి గడువు జనవరి 26 తేదీ గడిచిపోయి 80 రోజులు కావస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే సాగుచేయని భూములకు రైతు భరోసా వేయడం లేదని అధికారులు చెబుతుండటంతో.. ఇక రైతు భరోసాకు కొర్రీల గ్రహణం పట్టినట్టేనని రైతులు వాపోతున్నారు.