జడ్చర్ల టౌన్, మే 22 : రోజుల తరబడి నిరీక్షించినా వడ్లు కొనుగోలు చేయడం లేదని జడ్చర్లలోని పత్తి మార్కెట్‌యార్డు ఎదుట 167వ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. వారం రోజులైనా టోకెన్లు ఇవ్వడం లేదని, ధాన్యం తుకాలు వేయడం లేదని ఆరోపించారు.
ధాన్యం బస్తాలను కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ చెప్పినా పట్టించుకోరా అంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. వారం రో జులుగా ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తు న్నా తేమశాతం పేరుతో టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొందరికి టోకెన్లు ఇచ్చినా ధాన్యం తూకం వేయట్లేదని, సరిపడా టార్ఫాలిన్లు లేక వర్షానికి ధాన్యం తడిసి మొలకొస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేవలం 40 టార్ఫాలిన్లు ఉండగా, వాటిని తూకం వేసి ధాన్యం బస్తాలకు మాత్రమే పీఏసీసీఎస్ వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌యా ర్డు ఆవరణలో నిల్వ ఉన్న మిగతా ధాన్యం కుప్పల కోసం రైతులే టార్ఫాలిన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు చేసే వరకు రోడ్డుపైనే బైఠాయిస్తామంటూ రైతులు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. విషయం తెలుసుకున్న పౌరసరఫరాలశాఖ డీఎం రవినాయక్, ధాన్యం కొనుగొలు కేంద్రం నిర్వాహకులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
టోకెన్ల జారీలో నిర్లక్ష్యం..
ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు టోకెన్ల జారీలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నా రు. పీఏసీసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో 5 క్లస్టర్లలో 12 గ్రామాలున్నాయి. టోకెన్లు సకాలంలో అందించకపోవడంతో రోజుల తరబడిగా ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు.
వచ్చి వారం రోజులైంది..
నాలుగు ట్రాక్టర్ల ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి వారం రోజులైంది. టోకెన్ ఇచ్చి నాలుగు రోజులైంది. ఇంకా తూకం వేయలేదు. ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా. వర్షానికి ధాన్యం తడిసి మొలకొస్తుంది. టార్ఫాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ధాన్యం పండించడం ఓ ఎత్తయితే అమ్మడం మరో సాహసమైంది.
– స్వామి, రైతు, కావేరమ్మపేట
ధాన్యం కొనడం లేదు..
12 ట్రాక్టర్ల ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చిన. 20రోజులు అవుతుంది. తేమశాతం పేరుతో ధాన్యం కొనడం లేదు. వర్షానికి ధాన్యం తడిసిపోతుంది. సొంత డబ్బులతో టార్ఫాలిన్ కవర్లు తెచ్చుకొని ధాన్యానికి కప్పుకొంటున్నాం. తిండి, తిప్పలు లేకుండా కు ప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాం. లారీలో ఎక్కించే వర కు మాదే బాధ్యతని చెబుతున్నారు.
– జంగయ్య, రైతు, గంగాపూర్