అమరచింత, ఆగస్టు 18 : రైతును రాజుగా మారుస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకువచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు సెలవులు రావడంతోయూరియా కోసం రాత్రి, పగలు తేడా లేకుండా తిండితిప్పలు మానుకొని ప్రాథమిక సహకార సంఘం, రైతు ఆగ్రో సేవా కేంద్రాలకు తిరిగినా యూరియా దొరకక నిరాశతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఆత్మకూర్ పీఏసీసీఎస్కు యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి జోరుగా వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా క్యూలీ నిలబడినప్పటికీ పది గంటలకు కార్యాయానికి వచ్చిన అధికారులు యూరియా తక్కువగా ఉంది, రైతులు మాత్రం పెద్ద ఎత్తున క్యూలో ఉండడంతో కంగుతిన్న వారు పోలీసులు సాయంతో యూరియాను పంపిణీ చేస్తామని తెల్చడంతో అప్పటి వరకు క్యూ లైన్లో నిలబడ్డ రైతులు అలసట రావడంతో తమకు బదులుగా చెప్పులను క్యూలో పెట్టారు.
అయినా చాలా మందికి యూరియా దొరకకపోవడంతో తీవ్ర నిరాశతోఓ వెనుదిరిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చిన విషయం తెలుసుకున్న ఆత్మకూర్ మండల వ్యవసాయ అధికారి వినయ్‌కుమార్, పీఏసీసీఎస్ సీఈవో నరేశ్ యూరియా దొరకని రైతులు నిరాశపడవద్దని మంగళవారం మరో లారీ యూరియా లోడ్ వస్తుందని రైతులకు నచ్చజెప్పారు.