గద్వాల, ఏప్రిల్ 13 : రైతులు యాసంగిలో కాల్వలు, బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు ధాన్యం కొనుగోలుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో..
కలెక్టర్, పౌరసరఫరాశాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం గద్వాల, గట్టు, అయిజ తదితర ప్రాంతాల్లో వరిపంట చేతికొచ్చి పంటను కోసి కల్లా ల్లో ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వం మద్ధతు ధర సన్న రకానికి రూ.2320 మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్ కలిపి క్వింటా రూ.2820 చెల్లిస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. అయితే కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తుండడంతో కల్లాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో అకాల వర్షానికి తమ ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కల్లాల్లో రైతులు ఉంచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 69 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు
జిల్లాలో 69 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 49, పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 15, మెప్మా ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1లక్షా75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించింది. అయితే శుక్రవారం ఒక్క గట్టు మండల కేంద్రంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అంతేతప్పా జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధా న్యం కొనాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు రోజులుగా ఆరబెట్టుకుంటున్నా
నాది చెనుగోనిపల్లి. 3ఎకరాల్లో వరి పంటసాగు చేశా. పంట చేతికొచ్చింది. నాలుగు రోజులుగా వడ్లను ఆరబెట్టుకుంటున్నా. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇబ్బంది పడుతున్నాం. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. పాలిచ్చే ఆవుని వదిలి, దున్నపోతుని తెచ్చుకున్న చందంగా మా పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనాలి.
– చాంద్‌పాషా, రైతు, చెనుగోనిపల్లి