హన్వాడ, ఫిబ్రవరి 13 : యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా.. బోర్లల్లో నీరు లేక వందల ఎకరాల్లో వరి రైతులు గోస పడుతున్నారు. రైతు భరోసా అందకున్నా.. వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చినా.. పెట్టిన పెట్టుబడులు సైతం ఎల్లని దుర్భర పరిస్థితి నెలకొన్నది.
నెర్రెలు బారుతున్న పొలాలు
పచ్చని పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక పొలాలు నెర్రెలు బారుతున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కండ్ల ముందే వేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హన్వాడ మండలంలోని బుద్ధారం, టంకర, హన్వాడ గ్రామాల పరిసరాలల్లో ఈ పరిస్థతి నెలకొన్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో నీళ్లులేక పొలం నోళ్లు తెరిచింది.. రాబోయే వేసవిలోగా ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. వేల రూపాయలు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే పంటలు వాడుబడుతుండడంతో రైతు గుండె తరుక్కుపోతోంది.
బోర్లల్లో నీళ్లు ఉన్నా.. కరెంట్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో.. తెలియని తికమక పరిస్థితి. నీళ్లు పారిన మడికే మళ్లా నీళ్లు అందుతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులు, కుంటలు నీళ్లులేక ఎండుతుంటే.. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గి బోర్లల్లో నీళ్లు రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. దీంతో పాతాళం నుంచి గంగను రప్పించేందుకు విచ్చల విడిగా బోర్లు వేస్తున్నారు. ఇదే అదనుగా బోర్వెల్స్ యాజమాన్యం రేట్లను పెంచేశారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఎండిపోతున్న పంటలను సర్వే చేసి పరిహారం అందిస్తే బాగుంటుందని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
ఎకరాలో వరి సాగు చేశా..
రూ.18 వేలు పెట్టి ఎకరా పొ లంలో వరి సాగు చేశాను. బోర్ల ల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో వరి ఎండుతోంది. త క్కువ నీళ్లు వస్తుండడంతో ఎకరా టమాట, అర ఎకరలో ఉల్లి సాగు చేశాను. ఈ పంటలకు నీళ్లు కట్టేందుకు కరెంట్ సక్రమంగా ఉం డడం లేదు. ఎప్పు డు ఉంటుం దో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ సర్కారులో కరెంట్, నీళ్లకు ఢోకా లేకుండే.. ఈ సారి మాత్రం కష్టాలు తప్ప డం లేదు.. తెచ్చిన అప్పు లు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
– భీమయ్య, రైతు, టంకర