నాగర్‌కర్నూల్, జూలై 13 (నమస్తే తెలంగాణ) ; కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వలు బోసిపోయాయి. పదేండ్ల కాలంలో నిండుగా నీటితో ప్రవహించి ఆయ కట్టును పచ్చగా మార్చగా.. నేడు నిర్వహణ కరువై గడ్డి, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. నీళ్లు లేని కాల్వలను, అడుగంటిన రిజర్వాయర్లను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వల పరిధిలో పంటలు ఎలా పండించాలి అని మదనపడుతున్నారు. దీనికితోడు ఈసారి వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవిలో కాల్వల్లో పూడికతీత,పిచ్చి మొక్కలు తొలగించాల్సిన అధికారులు వాటిని మరిచారు. మంత్రి జూపల్లి స్వయంగా కాల్వలను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించే వరకు ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదని కర్షకులు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలం సాగు అంచనా 5.73 లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 1,73,307 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారగా.. రైతులు ఆందోళన చెందుతున్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల నాగర్‌కర్నూల్ జిల్లా వరప్రదాయిని. జిల్లాతో పాటుగా వనపర్తి, జడ్చర్ల ప్రాంతాల్లో దాదాపుగా 3 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు అందించే బృహత్తర పథకం.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో తొలిసీఎం కేసీఆర్ వల్ల సాకారమైన ఈ లిఫ్ట్ గత ఏడెనిమిదేండ్లు పల్లెల్లో పంటల సిరులను అందించింది. అలా ంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు బోసిపోయింది. వర్షాలు కురవకపోవడం.. కర్ణాటక నుం చి కృష్ణమ్మకు వరద జలాలు రాకపోవడంతో ఎంజీకేఎల్ఐ పథకంలోని జొన్నలబొగుడ, గుడిపల్లి, ఎల్లూరు జలాశయాల్లో నీటి మట్టా లు అట్టడుగు స్థాయి లో ఉన్నాయి. గతేడాది ఈ సమయ ంలో నిండుగా నీళ్ల తో ఉండగా, కా ల్వల్లో నిరంతరం నీళ్లు ప్రవహించా యి. ఇలా ఏండ్ల త రబడిగా జిల్లా రైతాంగానికి సేద్యంలో ఢోకా లేకుండా చేసింది. కానీ ఈ సంవత్సరం నీళ్లు లేక బోసిపోయింది. గ్రామాలకు నీళ్లు తీసుకెళ్లే కాల్వలు సైతం వట్టిపోయాయి. కాల్వల్లో, గట్ల వెంబడి పిచ్చి మొక్కలు, గడ్డితో దర్శనమిస్తున్నాయి. సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం కాల్వలను ముందస్తుగా సిద్ధం
చేయాల్సి ఉన్నా పట్టించుకున్న దాఖలాలే లేవు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో మునిగిపోవడం.. అధికారులు నిర్లక్ష్యం వ హించడంతో కాల్వల నిర్వహణ చేపట్టలేదు. వారం కిందట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అప్ప టి వరకూ అధికారులు ప్రాజెక్టు పనులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందులో భాగంగా కాల్వల పూడికతీత, పిచ్చి మొక్కలు తొలగించేందుకు అంచనాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఈ పనులన్నీ ఎండాకాలంలో చేపట్టాల్సి ఉన్నది. వానకా లం రాకముందే చర్యలు తీసుకోవాల్సి ఉండ గా మంత్రి ఆదేశంతోనే అధికారుల్లో కదలిక రావడంపై రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు కురవా ల్సి ఉన్నా ఆలస్యం కావడంతో కాల్వలు ఖాళీ గా ఉన్నాయి. లేకుంటే నిండుగా నీళ్లతో దర్శనమిచ్చేవి. అధికారులు నివేదికలు అందించి, ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి పను లు ఎప్పటిలోగా చేపడతారో ప్రశ్నార్థకమే.
1.73 లక్షల ఎకరాల్లోనే..
జిల్లాలో వ్యవసాయ సాగుబడిపైనా ప్రభావం పడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలం సాగు అంచనా 5.73 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,73,307 ఎకరాల్లో మాత్రమే పం టలు సాగయ్యాయి. ఇందులో ఒక్క పత్తి పంటనే అత్యధికంగా 1,52,98 ఎకరాల్లో వేశారు. భారీ వర్షాలు కురవకపోవడంతో కల్వకుర్తి లిఫ్ట్‌కు కాల్వలు నీళ్లు లేక బోసిపోయాయి. తద్వారా సాగుపై పడిన ప్రభావం దిగుబడిపైనా పడనున్నది. కాగా ఈ అంశంపై స్పందించేందుకు సంబంధిత ఇరిగేషన్ అధికారులు సైతం అందుబాటులో ఉండటం లేదు. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఉన్నా సీఈ, ఈఈ వంటి అధికారులు ఉండరు. ఫోన్లు చేసినా స్విచ్ఛాఫ్‌లో ఉండటం, లేకుంటే లిఫ్ట్ చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పం దించి కాల్వల నిర్వహణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.