నాగర్‌కర్నూల్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో పంటలు సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. వానకాలం సీజన్ ముగిసి ధాన్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు యాసంగి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఎగువ నుంచి కృష్ణా నదికి వరదలు రాకపోవడం, శ్రీశైలం జలాశయం లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వ లేకపోవడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మా రింది. ఈ నేపథ్యంలో గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి సాగు గణనీయంగా తగ్గే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం వరి మినహాయిస్తే నాగర్‌కర్నూల్ జిల్లాలో కేవలం 90,328 ఎకరాలకు మాత్రమే పం టల ప్రణాళిక తయారు చేశారు. ఈ మేరకు 79,887 ఎకరాల్లో వేరుశనగ, 10,743 ఎకరాల్లో మినుములు సాగు చేయనున్నారు. వేరుశనగ పంట మరో 30 వేల ఎకరాలకు చేరొచ్చని అంచనా. పూర్తి స్థాయిలో నివేదికల తర్వాత 1.20 లక్షల ఎకరాల వరకు వరి సాగు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
యాసంగి పంటల సాగుకు రైతన్నలు సిద్ధమయ్యారు. వానకాలం సీజన్ ముగిసి ధాన్యం విక్రయాలు చేసుకుంటున్న రైతులు యాసంగిలో పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వర్షాభావం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత యాసంగితో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గే అవకాశమున్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
యాసంగి సాగు షురూ..
యాసంగి సాగుకు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. రైతులు గత సీజన్లో పండించిన పంటల ఆధారంగా వ్యవసాయశాఖ పంటల అంచనాను రూపొందిస్తుంది. ఈక్రమంలో ప్రస్తుత యాసంగి సీజన్లోనూ పంటల సాగుపై ఓ అంచనాను తయారుచేశారు. దీని ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లాలో వరి, వేరుశనగ సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపనున్నారు. కాగా గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ వానకాలంలో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. బోర్లల్లో నీళ్లు రావడం లేదు. ఎగువన కృష్ణకు వరదలు రాకపోవడం, శ్రీశైలం జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వ లేకపోవడం ఫలితంగా ఎంజీకేఎల్ఐ ద్వారా వచ్చిన నీటితో ఇప్పటికే నిండుగా, ఓ మోస్తరుగా నీళ్లతో ఉన్న చెరువులు కూడా రాబోయే కాలంలో అడుగంటే పరిస్థితులున్నాయి. దీంతో పంటలు చేతికొచ్చేటప్పటికి బోర్లల్లో కూడా నీళ్లు ఉండకపోవచ్చని వ్యవసాయ అధికారులు, రైతులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుత యాసంగి సీజన్లో పూర్తిస్థాయిలో పంటల సాగు చేపట్టకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుత పరిస్థితుల మేరకు ఈ సీజన్లో వ్యవసాయ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం వరి మినహాయిస్తే కేవలం 9,328ఎకరాలకు మాత్రమే ప్రణాళిక తయారు చేశారు. ఇంకా వరి పంట వివరాలను నమోదు చేయలేదు. అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉండటం, రైతులు కూడా గతానికి మించి సాగు చేయకపోవడంతో తాజా నివేదికల ప్రకారం 30 ఎకరాల్లోనే వరి పంట నమోదైంది. ఇప్పటివరకు తయారు చేసిన అంచనాల ప్రకారం వేరుశనగ 79,887 ఎకరాల్లో, జొన్న 668 ఎకరాల్లో, మొక్కజొన్న 1,601 ఎకరాల్లో, మినుములు 10,743 ఎకరాల్లో సాగు చేయనున్నారు. వేరుశనగ మరో 30వేల ఎకరాలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో నివేదికల తర్వాత వరి పంట 1.20లక్షల వరకు సాగు చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
కాగా గత సీజన్లో మొత్తం 3,12,096ఎకరాల్లో యాసంగి సాగు జరిగితే ఈసారి 3లక్షల ఎకరాలకు చేరడం కష్టంగానే కనిపిస్తోంది. వర్షాభావం, నీటి సమస్య యాసంగి సాగుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. గత సీజన్లో వేరుశనగ 1,17,813 ఎకరాల్లో సాగు చేయగా ఇప్పటి వరకు 79,897ఎకరాల్లో, వరి 1,55,553 ఎకరాలుండగా 1.20లక్షల ఎకరాలకు వస్తే గొప్పగా భావించే పరిస్థితులున్నాయి. జొన్న, మొక్కజొన్న, మినుములు, కందులు వంటి పంటల పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉండే అవకాశముంది. దీనికితోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో వ్యవసాయానికి సాగునీళ్లు, 24గంటల కరెంట్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని రైతన్నలు యోచిస్తున్నారు. మొత్తం మీద యాసంగి పంటల సాగు గత సీజన్‌తో పోలిస్తే ఆశించినట్లుగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.