కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17,70,503 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 5,38,462 ఎకరాల్లో సాగు చేయనుండగా, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 2,35,000 సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గద్వాల, మే 23 : కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాదైనా కాలం కలిసి వస్తుందనే ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. వానకాలం పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి తోడు బోరుబావుల్లో నీటిశాతం పెరగడంతో సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు బీఆర్ఎస్ సర్కారులో ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడంతో వారి సలహాలు, సూచనలు రైతులకు అందడంతో సాగు పెరగడానికి మరో కారణంగా చెప్పవచ్చు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలంలో ఎక్కువగా పత్తి, వరి, వేరుశనగ, పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చి, ఉల్లి తదితర పంటలు సాగు చేస్తారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 13మండలాలకు సంబంధించిన సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వానకాలంలో జిల్లాలో 3,70,390 ఎకరాల్లో పంటలను సాగుచేశారు. ఈ వానకాలం 3,67,211 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ తెలిపారు. 1,42,410 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. వరి 95,762 ఎకరాల్లో, మొక్కజొన్న 12,887 ఎకరాలు, వేరుశనగ 11,180, కందులు 42,585, ఆముదాలు 1,031, పొగాకు 10,878, బ్లాక్‌గ్రామ్ 1,160 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. దీంతోపాటు హార్టికల్చర్ పంటలైన మిరప 30,305 ఎకరాల్లో, ఆయిల్‌పాం 3,936, ఇతర పంటలు 11,665 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. వ్యవసాయ పంటలు 3,21,305 ఎకరాల్లో, వాణిజ్యపంటలు 45,906 ఎకరాల్లో సాగు చేయనున్నారు.
వానకాలానికి సంబంధించి మొత్తం 1,18,586 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. యూరియా 36,078 మెట్రిక్ టన్నులు, డీఏపీ 13,234, పొటాష్ 6,815, ఏఎస్ 2,669, సూపర్‌పాస్పెట్ 6,615, కాంప్లెక్స్ ఎరువులు 53,173 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందులో ప్రస్తుతం యూరియా 15,442 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,694, సూపర్ పాస్పెట్ 759, పొటాష్ 1,738, కాంప్లెక్స్ ఎరువులు 18,009 టన్నులు అవసరం కాగా, మొదటి విడుత అవసరమైన 37, 644 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో అధికంగా రైతులు పత్తి 1,42,410 ఎకరాలు, వరి 95,762 ఎకరాల్లో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి మద్దతు ధర ఇస్తుండడంతోపాటు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు కేవలం నల్లరేగడిలో మాత్రమే పత్తి పంట సాగు చేయాలని సూచిస్తున్నా రైతులు అన్ని పొలాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. అలాగే వరికి మద్ధతు ధర బోనస్ ఇస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. కొనేటప్పుడు తప్పనిసరిగా రైతులు దుకాణదారులతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో విత్తనాలు అమ్మడానికి వస్తే ఎవరూ కొనుగోలు చేయొద్దు. అటువంటి వారి సమాచారం ఇవ్వాలి. నాసిరకం విత్తనాలు కొని మోసపోవద్దు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశాం.
నాగర్‌కర్నూల్, మే 23 : నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. గతేడాదికంటే ఈసారి సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరగనున్నట్లు అధికారుల అంచనాలను బట్టి తెలుస్తోం ది. హార్టికల్చర్‌ను మినహాయిస్తే 5,38,462 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. గతేడాది 4,35,692 ఎకరాల్లో పంటలు సాగవగా, ఈఏడాది స్వల్పంగా పెరగనున్నది. పత్తి అధికంగా 2,86,471 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతేడాది 2,20,449 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 66వేల ఎకరాల్లో పెరగనున్నది. వరి 1,60,021 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతేడాది 1,56,977 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 3వేల ఎకరాల్లో సాగు పెరగనున్నది. మొక్కజొన్న గతేడాది 41,752 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 72,929 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొక్కజొన్న 31,177 ఎకరాల్లో, జొన్నలు 7,822, కందులు 8,909, పెసర్లు 368, ఆముదం 239, వేరుశనగ 895 ఎకరాల్లో ఈసారి సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. హార్టికల్చర్ సైతం 52,603 ఎకరాల్లో సాగవనున్నాయని, గతేడాది 51,320 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,283 ఎకరాలు అధికంగా సాగు చేయనున్నారు.
ఈవానకాలానికి సంబంధించిన అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఉంచుతున్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. 2,865 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, వడ్లు 40వేల క్వింటాళ్లు, కందులు 267, మొక్కజొన్న 5,834, వేరుశనగ 850, జొన్నలు 313, ఆముదం 10, పెసర్లు 26 క్వింటాళ్ల చొప్పున విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 808 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసేందుకు 8క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
వనపర్తి, మే 23(నమస్తే తెలంగాణ) : వచ్చే వానకాలం సీజన్లో వరి సాగుబడుల వైపే రైతన్నలు మొగ్గు చూపుతున్నారు. వానకాలం పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి పె ట్టింది. ఈ మేరకు 1,13,306 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు జరుగుతుందని వ్య వసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అధికభాగం వరి సా గుబడులే ఉండడం ద్వారా వరి సా గుబడుల వైపే రైతన్నల అడుగులు అన్న ట్లు కనిపిస్తుంది. 82,400హెక్టార్లలో వరి సాగవుతుందని అంచనా వేశారు. పది రకాల పంటల సాగు చేయనున్న క్రమంలో అధిక భాగం వరి శిస్తు ఉంది. వచ్చే వానకాలంలో శిస్తు చేయనున్న పంటల వివరాలు ఇలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గత ఏడాది వానకాలంలో 78,200 హెక్టార్లలో వరి శిస్తు అంచనా ఉండింది. దీన్ని బట్టి వచ్చే వానకాలం సీజన్ మరింత పెరుగుతుందన్న అంచనా కనిపిస్తున్నది.
పాలమూరు, మే 23 : మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 2025-26 సంవత్సరానికి 3,46,830 ఎకరాల్లో యాసంగి పంట సాగు చేయనున్నట్లు జిల్లా వ్యసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాదికి మించి 15,332 ఎకరాల్లో అధికంగా సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరి గతేడాది 1,94,962 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 2లక్షలు, మొక్కజొన్న 30వేలు, జొన్న 18వేలు, రాగులు 150, పత్తి 85వేలు, ఆముదాలు 330, నువ్వులు 50, కందులు 10వేలు, ఇతర పంటలు 3,300 ఎకరాలు సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. పంటలకు సరిపడా విత్తనాలు,ఎరువులు యూరియా 6891.93 టన్నులు, డీఏపీ 3408.61, ఎంవోపీ 202.35, ఎస్ఎస్పీ 448.55, కాంప్లెక్స్ 22,335.2 టన్నుల ఎరువులు అవసరమవుతారని చెబుతున్నారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి. కొనుగోలుకు ఖచ్చితంగా రశీదు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు. రైతులకు ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి.
నారాయణపేట, మే 23 : జిల్లాలో వానకాలం పంటల సాగులో పత్తి పంట వైపు రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వానకాలం సీజన్లో జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో పత్తి, లక్షా 75వేల ఎకరాల్లో వరి, 70వేలు కంది, 5వేలు జొన్న, 5వేల ఎకరాల్లో పెసర పంటను సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు.