మద్దూర్(కొత్తపల్లి), నవంబర్ 15 : ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం వెంటనే గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని శనివారం కొత్తపల్లి మండలంలోని మన్నాపూర్ వద్ద మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై రైతులపై ఆందోళన నిర్వహించారు.
వరి కోతలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా దాన్యం కల్లాల్లో, రోడ్ల పైనా కుప్పలుగా ఉంచుకోవడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మన్నాపూర్ గ్రామానికి చెందిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులను గన్నీ బ్యాగులు కావాలని అదే గ్రామానికి చెందిన నాగారం నారాయణరెడ్డి అడగగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకవస్తేనే ఇస్తామని చెప్పడంతో మనస్తాపం చెందిన రైతు మద్దూర్ మహబూబ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు.
దీంతో అరగంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచి పోయాయి. రైతుకు మద్దతుగా కొత్తపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మద్దూర్ పోలీసులు రైతులను సముదాయించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
ఈ విషయంపై మద్దూర్ ఏపీఎం కృష్ణవేణిని వివరణ కోరగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఆర బెట్టుకోవాలి. అనంతరం మండల వ్యవసాయ అధికారులు తేమశాతం వచ్చినట్లు గుర్తించిన తరువాత రైతుకు కావాల్సిన గన్నీ బ్యాగులు అందజేస్తామని తెలిపారు. ఈ విషయంపై అన్ని గ్రామాల్లోని బుక్ కీపర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు.