నాగర్కర్నూల్, మే 12 : నాగర్కర్నూల్ జిల్లాలో మక్క రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే నెలల తరబడిగా కొనగోళ్లలో జాప్యం చేస్తుండడంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ల్లు మక్కలతో నిండిపోయాయి. ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రేయింబవళ్లు కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో వ్యవసాయమంటేనే విసుగొచ్చేలా చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో మార్కెట్లలో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లలో జాప్యం జరగడంతో కల్లాల్లోనూ, మార్కెట్లలోనూ మక్కల రాశులు మంచెత్తాయి. మార్కెట్కు వచ్చిన ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్ నుంచి తరలించే వరకూ రైతులను కాపలాగా ఉంచడంతో చాలామంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటి వద్ద నుంచి సద్దులు తెచ్చుకొని తింటూ కాంటా వేసిన ధాన్యానికి సైతం కాపలాగా ఉంటున్నారు. దీనికితోడు జిల్లా కేంద్రంతోపాటు ఆ యా మండలాల్లో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు కొనుగోలు దందా నడిపిస్తున్నారు. తక్కువ ధరకు చిన్న, సన్నకారు రైతుల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు 60 శాతమే..
రైతు పండించిన మొక్కజొన్నలను సకాలంలో కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోం ది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 15 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.5 మెట్రిక్ టన్నుల మక్కలను మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రైతు పండించిన పంటలో కేవలం 60శాతం మాత్రమే కొనుగోలు చేసింది. ఇంతకాలం గన్నీ బ్యాగుల సమస్య, హమాలీల కొరత, కాంటా చేసినా తరలించేందుకు లారీల కొరత ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. నెలరోజులుగా మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో కేవలం 60శాతం మాత్రమే మ క్కలను కొన్నారు. ఇంకా ఇంతకు మించి మార్కెట్లలోనూ, పంట పొలాల్లోనూ మక్కలు ఉండిపోయాయి. స్థలం లేకపోవడంతో తుంచిన ధాన్యాన్ని సైతం మార్కెట్కు తెచ్చేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. నాగర్కర్నూల్ మార్కెట్లో ఏకంగా ఈనెల 14వ తేదీ వరకు మొక్కజొన్నను మార్కెట్కు తీసుకురావద్దని సూచికబోర్డును ఏర్పాటు చేశారు. అంటే రైతు పండించిన పంట కొనుగోలులో ప్రభుత్వం ఎంత జాప్యం చేస్తుం దో అర్థమవుతోంది.