మాగనూరు, మార్చి 18 : మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బోర్లు అడుగంటాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేసినా లాభం లేదని.. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వల్లోనైనా నీళ్లు పారితే పంటలు చేతికందేవని, కానీ ఆ పరిస్థితి లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందుచూపు కరువైన కారణంతో సంగంబండ రిజర్వాయర్ కాల్వలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. కుడి కాల్వలో అయితే చివరి ఆయకట్టు రైతులకు చుక్క నీరు కూడా అందక పంటలు ఎండుముఖం పట్టాయి. రిజర్వాయర్‌లో 20 లేదా 30 హార్స్పవర్ మోటర్లు పెట్టి సాగునీరు కాల్వల ద్వారా పారిస్తే చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాటి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సంగంబండ రిజర్వాయర్‌లో రైట్ హై లెవెల్ కెనాల్‌కు సాగునీరు అందకపోతే 20 హార్స్పవర్ మోటార్లు పెట్టి సాగునీరు పారించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పంటలు ఎండుతున్నా ప్రభుత్వం గానీ.. అధికారులు గానీ.. స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కాల్వల్లో తుంగ, పూడిక తీయకపోవడంతోనే..
సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్లో రూ.40 లక్షలలతో అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని తొలగించారు. కానీ కాల్వలో పేరుకుపోయిన తు ంగ, పూడికను తీయలేదు. దీం తో ఓబులాపూర్ గేటు సమీపం వరకు సక్రమంగా నీరు అం దడం లేదని రైతులు వాపోతున్నారు. కొందరు ఓబులాపూర్ రైతులు.. వడ్వాట్ రైతులు కలిసి కాల్వలో పేరుకుపోయిన తుంగ ను తొలగించారు. అయినా సాగునీరు సరిగ్గా రావడం లేదు. దీంతో పలు చోట్ల పంటలు ఎండుతున్నాయి. వడ్వాట్కు చెందిన నరసింహాగౌడ్ పొలం నాలుగు గుంటలు నీళ్లులేక నెర్రెలు బారింది. అదే గ్రామానికి చెందిన మరికొందరి పొలాలలో పంటలు ఎండాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాల్వలకు నీళ్లు వదిలితేనే పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదు.
ఎండిన పంట.. రైతన్నకు తంటా..
ధన్వాడ, మార్చి 18 : రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జాలాలు అడుగంటుతున్నాయి. అన్నదాతలు పంటలకు నీరు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మండలంలోని రామకిష్టయ్యపల్లి గ్రామంలో వరి పంటకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేది లేక ఎండిన పంటలను గొర్రెలను మేపుతున్నారు. గతంలో పుష్కలంగా నీరు ఉండగా రెండు పంటలు సాగు చేసుకున్నారు. ప్రస్తుతం భూగర్భ జాలాలు అడుగంటిపోతుండడంతో రైతులకు గుండె కోతలు తప్పడం లేదు. రామకిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు దామోదర్‌రెడ్డి బోరులో నీటిమట్టం తగ్గడంతో రైతు సాగు చేసిన వరి పంట ఎండిపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నాడు. రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే భూగర్భ జాలాలు అడుగంటడంతో పంట ఎండిపోయింది. పంటను కాపాడుకునేందు కోసం రూ.2లక్షలు వెచ్చించి బోరు వేసినా చుక్కనీరు రాకపోవడంతో పంట కోసం, బోరు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళనకు గురవుతున్నాడు.
వట్టిపోతున్న బోర్లు, బావులు
చారకొండ, మార్చి 18 : ఎటుచూసినా ఎండిన చెరువులు.. వట్టిపోయిన బోర్లు, బావులు.. అడుగంటిన భూగర్భ జలాలు.. నెర్రెలు వారిన పంట లు.. వేలకువేలు పోసి వందల అడుగులు తవ్వినా పడని బోర్లు.. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతుల తాపత్రయం.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.. కాల్వల ద్వారా నీరు అం దక.. బోర్ల నుంచి రాక.. దీనికి తోడు కరెంట్ సమస్యలతో పంటలు మార్చిలోనే ఎండుముఖం పడుతున్నాయి. నీటినిల్వలు గణనీయంగా తగ్గిపోవడం తో 70 శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలోనే ఎండుముఖం పట్టడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కొందరైతే నీటిని అందించలేక పంటలను పశువులు, గొర్రెల మేతకు వదిలేసిన పరిస్థితులు చారకొండ మండలంలోని కనిపిస్తున్నాయి. మొత్తం 2,121 ఎకరాల్లో వరి, మక్కలు 60 ఎకరాలు, జొన్నలు 164 ఎకరాలు, ఆముదాలు 176 ఎకరాలు, వేరుశనగ 1,624 ఎకరాలు, కందులు 60 ఎకరాలు సాగై ంది. అయితే నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఎక్కడా పంటలు పూర్తి స్థాయిలో చేతికొచ్చే పరిస్థతి కనిపించడం లేదు. దీంతో పంటలను ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఒక్కో రైతు 400 నుంచి 500 ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నా నీటి జీడలు మాత్రం కనిపించడం లేదు.
పదేండ్లలో చూడలేదు
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో పదేండ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు. గతంలో బోర్లు, బావులు ఎండిపోకుండా వర్షాలు బాగా పడ్డాయి. నేను రెండెకరాల్లో వరి సాగు చేశాను. బోరు మొదట్లో బాగా నీరు పోసేది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టి మధ్యలోనే నీళ్లు పోయకుండా ఆగిపోతుండడంతో ఎకరా పంట పూర్తిగా ఎండింది. అప్పులు చేసి సాగుబడులు చేసినా నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
– రాంలాల్‌నాయక్, అగ్రహారంతండా, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
అప్పులు తెచ్చి సాగు చేశాను
భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. నేను ఎకరాలో వరి, రెండెకరాలలో జొన్న పంట వేశాను. ఉన్న ఒక్క బోరులో నీళ్లు రాకపోవడంతో జొన్న, వరి పూర్తిగా ఎండిపోయింది. 20 రోజులైతే చేతికి అందే పరిస్థితి.. అప్పులు చేసి సాగుబడులు చేసినా.. చేసిన అప్పులు పెరుగుతున్నాయి.. ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందించి ఆదుకోవాలి.
– బిచ్యానాయక్, వంకరాయితండా, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు సాగు చేసిన వివిధ పంటలు ఎండిపోయాయి. ఇప్పటి వరకు 23 ఎకరాల వరకు వరి ఎండిపోయిన్నట్లు గుర్తించాం. మిగితా గ్రామాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలి స్తున్నాం.. తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ఇంకా పంటలను పరిశీలిస్తున్నాం.. మిగితా వివరాలు కూడా సేకరిస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు..
– తనూజరాజ్, ఏవో చారకొండ, నాగర్‌కర్నూల్ జిల్లా