గోపాల్పేట, మే 22 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనడం లేదు.. అరకొర కొన్నా లారీలు రావడం లేదని గురువారం గోపాల్పేట మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. కాగా, ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలుపగా, కాంగ్రెస్ నాయకులు సైతం జెండాలు పట్టుకొని రైతులకు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినప్పటికీ కొనుగోలుకు నోచుకోకపోవంతో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దవుతున్నాయ ని వాపోయారు. నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కొనుగోలులో అధికారులు, సర్కారు విఫలం చెందిందని మండిపడ్డారు.
వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని వేడుకున్నా కనికరం లేకుం డా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కే అకాల వర్షాలతో ధాన్యం తడిసి చాలా నష్టపోయామని, రైతులను ఇంతలా క్షోభ పెట్టడం సర్కారు తగదని ఆక్రోశం వెల్లగక్కారు. అనంతరం ధర్నా వద్దకు ఎస్సై నరేశ్‌కుమార్, డిప్యూటీ తాసీల్దార్ తిలక్‌కుమార్, ఆర్ఐ యాదయ్య చేరుకొని వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని, లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.