జడ్చర్లటౌన్, జూలై 3 : ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతుల మేలు కోసం కృషి చేసిన కేసీఆర్ అంటే చాలా అభిమానం.. అందుకే తన పొలంలో వరినాట్ల మొలకలతో కేసీఆర్ పేరును రాశానని చెప్పుకొచ్చాడు ఓ రైతు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు అనే రైతు శుక్రవారం తన ఎకరం పొలంలో వరిపంట కోసం వరివిత్తనాలు చల్లాడు. ఈ క్రమంలో మొదటగా పొలంలో వరినాట్లతో కేసీఆర్ పేరు రాసి ఆ తర్వాత పొలంలో వరి విత్తనాలు చల్లాడు.
2002లో తెలంగాణ కోసం గ్రామంలోనే తాను మొదటగా బీఆర్ఎస్ జెండా పడితే అప్పట్లో గ్రామంలో ఉన్న వారు తనను అవమానపరుస్తూ తెలంగాణ వచ్చేది లేదు.. పోయేదిలేదంటూ హేళనగా మాట్లాడారని, అయినా తాను బెదరక నేనొక్కడినే జెండా పట్టి పోరాడుతాను అని.. మీరందరూ కూడా జెండా పడ్తారని చెప్పానని పర్వతాలు తెలిపాడు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక వ్యతిరేకించిన వారు సైతం గులాబీ జెండా పట్టారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సారూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తీసుకొచ్చి రైతులకు మంచి చేసిండు.. అందుకే కేసీఆర్ సార్ అంటే చాలా అభిమానం.. మళ్లీ కేసీఆర్ సారూ వస్తేనే రైతులకు మంచి జరుగుతుందని పర్వతాలు చెబుతున్నాడు.