మహబూబ్‌నగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసనలో పాల్గొన్నది. అక్కడి ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు ఈమెపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. రక్తం కారుతుండగా రోధించినా అక్కడున్న ఒక్క పోలీస్ కూడా రక్షించలేదు.
గాయంతో అలాగే గద్వాల ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకున్నది. తలకు తగిలిన గాయంతో రాజోళి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ అక్కడున్న ఎస్సై జగదీశ్వర్ కేసు గీస్ జాంతానై.. అంటూ ఉల్టా బెదిరించాడు. ఈమెకు పెద్ద గాయమైనా స్పందించని పోలీసులు.. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతంలో టెంట్లు, కంటైనర్ ధ్వంసం చేస్తే ఫ్యాక్టరీ యాజమాన్యంపై హత్యాయత్నం చేశారని పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇదే ఎస్సై అప్పటికప్పుడు రైతులపై కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.