మహబూబ్‌నగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మీ మీద కేసు నమోదైంది.. వారెంట్ ఇష్యూ అయింది మిమ్మల్ని అరెస్టు చేయడానికి మా పోలీసులు వస్తున్నారు.. వెంటనే లొంగిపోండి.. అంటూ డీజీపీ పేరుమీద ఓ ప్రముఖుడికి కాల్.. మీపై అనుమానం ఉంది.. మీ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.. అంటూ యువతులకు కాల్స్.. లాటరీ తగిలిందంటూ మెసేజ్‌లు.. సెల్ ఫోన్లో అపరిచితులు పంపించిన మెసేజ్ లింకు ఓపెన్ చేస్తే అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయం.. ఇవన్నీ నిత్యకృత్యమైంది. తాజాగా పోలీస్ సీబీఐ, సీఐడీల పేరుతో వస్తున్న వాట్సాప్ కాల్స్ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో చాలామంది బాధితులు ఈ నకిలీ కాల్స్‌కు బలవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వ్యక్తికి సీబీఐ పేరా ఓ కాల్ వచ్చింది వెంటనే భయపడి పోయి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ సమర్పించుకున్నారు.
ఒకటి కాదు రెండు కాదు కోటి రూపాయలు బలవంతంగా లాగేశారు. మోసపోయానని తెలుసుకొని లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మరో యువతికి హైదరాబాద్‌లో ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది అంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో ఏకంగా రూ.10 లక్షలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నది. ఇంకేముంది అదంతా ఫేక్ అని తెలియడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఫేక్ కాల్స్‌కు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు వస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసులు అంటున్నారు. ఒకవేళ అపరిచితులకు డబ్బులు సమర్పించుకున్న వెంటనే 1930కు కాల్ చేస్తే లావాదేవీలన్నీ బ్లాక్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. మోసపోయాక మాత్రమే బాధితులు స్టేషన్‌కు వస్తున్నారని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో అన్నారు. ఒకవేళ ముందస్తుగా వస్తే అలాంటి నేరగాళ్లను పట్టుకునే వీలుంటుందని జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల పోలీస్ అధికారుల ఫొటోలు తగిలించుకొని ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. దీంతో జనం హడలిపోయి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు.
రక్షణ కవచంగా ‘1930’..
సాధారణంగా వాట్సాప్ కాల్స్‌లో పోలీసుల పేరుతో బెదిరించిన ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం సైబర్ క్రైమ్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఇలాంటి ఫేక్ కాల్స్‌ను నమ్మి బాధితులు మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేయాలి. ఇలా చేస్తే మీరు పంపించిన డబ్బులు ఏ అకౌంట్‌కు అయితే వెళతాయో వెంటనే ఆ అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. నేరుగా బ్యాంక్ సర్వర్లతో లింకు చేసి ఈ లావాదేవీల మొత్తాన్ని ఆపేస్తారు. దీంతో డబ్బులు సైబర్ నేరగాళ్లకు చేరవు. బాధితులు వెళ్లి ఫిర్యాదు చేస్తే తిరిగి ఆ డబ్బులు పోలీసులు అకౌంట్లోకి జమ చేస్తారు.
సాఫ్ట్వేర్యువతులే టార్గెట్
సాఫ్ట్వేర్ యువతులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల చాలాచోట్ల డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే అదనుగా భావించి సాఫ్ట్వేర్ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో బెదిరిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయిలు సాధారణంగా కంపెనీ తరఫున ఫ్రెండ్స్ తరఫున పార్టీలకు వెళ్లడం సహజం. అయితే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందంటూ గాలం వేస్తున్నారు.. అంతేకాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బెదిరిస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ అమ్మాయి బెదిరిపోయి సైబర్ నేరగాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు సమర్పించుకున్నది. వాట్సాప్ కాల్లో డీపీ చూస్తే పోలీస్ ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఉపయోగించి డీపీలను పెట్టుకొని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు.
రూ.కోటి సమర్పయామి..
అతను సమాజంలో పేరున్న వ్యక్తి.. ఓ రోజు అనుకోకుండా వాట్సాప్ కాల్ వచ్చింది.. ఫలానా పోలీస్ అధికారిని మాట్లాడుతున్న అంటూ ఫోన్ చేశారు. గట్టిగా బెదిరించడంతోపాటు అనేక ఫేక్ డాక్యుమెంట్లను అప్పటికప్పుడే సృష్టించి వాట్సాప్ వెబ్ ద్వారా పంపించారు. ఇది నిజమని నమ్మి అకౌంట్లో ఉన్న రూ.కోటి పంపించి బతిమాలాడారు. వెంటనే డబ్బు చేరగానే ఫోన్ కట్ అయింది. తిరిగి ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. మరికొద్ది సేపటికి ఆ నెంబర్ అసలు కలవడం లేదు. వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే అవన్నీ నకిలీవని తేలింది. ఇంకేముంది లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇదంతా ఆలస్యం కావడంతో సైబర్ నేరగాళ్లు బాధితులతో తీసుకున్న డబ్బులను అప్పటికప్పుడే మాయం చేశారు.
పాకిస్తాన్ సిరీస్‌తో వాట్సాప్ కాల్స్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల వస్తున్న వాట్సాప్ కాల్స్ జనాలను భయభ్రాంతులను చేస్తున్నాయి. +92 సిరీస్‌తో వస్తున్న నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా వాట్సాప్ కాల్స్ పోలీస్ అధికారుల పేర్లు ఫొటోలతో వస్తుండడంతో జనం నిజమైన పోలీసులు అనుకొని నమ్మి కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు మీపై కేసులు ఉన్నాయని వారెంట్ ఉందని నకిలీ పత్రాలు అప్పటికప్పుడు సృష్టించి వాట్సాప్ చేస్తున్నారు. ఇది నమ్మి మమ్మల్ని అరెస్టు చేయొద్దు అంటూ బతిమిలాడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మీ వారెంట్ క్యాన్సల్ కావాలంటే పోలీసులు మీ ఇంటికి రాకుండా ఉండాలంటే ఫలానా అకౌంట్‌కు డబ్బులు పంపించండి అంటూ వెంటనే కాల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తీవ్రభయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో బాధితులు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి అనుమానితుల ఫోన్ కాల్స్ వస్తే వెంటనే ఆ నెంబర్‌ను రిపోర్ట్ స్పామ్ లేదా బ్లాక్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వండి
ఈ మధ్య పోలీస్ అధికారుల పేరు మీద నకిలీ వాట్సా ప్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. అరెస్ట్ వారెంట్ అం టూ.. కేసు నమోదైనదంటూ రకరకాల బెదిరింపులకు గు రి చేస్తున్నారు. ఇలాంటి కాల్స్‌ను జనం అస్సలు నమ్మవ ద్దు. ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే సైబర్ నేరగాళ్లని పట్టుకోవచ్చు. ఒకవేళ డబ్బులు పోతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇస్తే ఆ లావాదేవీలన్నీ ఆపేస్తాం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దు. రకరకాల పేర్ల మీద చీటింగ్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్