మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 5 : 60ఏండ్లు అధికామిస్తే పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, వారిని నమ్మితే మళ్లీ గోసపడడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ఏనుగండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. మహబూబ్‌నగర్ పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్నికల తర్వాత ఫోన్ చేస్తే.. మీరు డయల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేరనే సమాధానమే వస్తుందని, ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధిని కాంక్షించే బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. రోడ్డు విస్తరణ వల్ల ఏనుగొండకు ఎంతో ప్రయోజనం కలిగిందని, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. అప్పన్నపల్లి ఆర్వోబీ పదేండ్లుగా పెండింగ్‌లో ఉండగా, తాను ఎమ్మెల్వే అయిన వెంటనే వేగవంతంగా పూర్తి చేయించానన్నారు. రెండో ఆర్వోబీని కేవలం ఏడాది వ్యవధిలో అద్భుతంగా నిర్మించడంతోపాటు సెంట్రల్ లైటింగ్ పనులు కూడా పూర్తి చేసామన్నారు. అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలన్నారు. అనంతరం మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు దూరంగా ఉన్న వ్యక్తిని దూరం పెట్టాలని, పని చేసే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అండగా ఉండి మరోసారి గెలిపించుకోవాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనుగొండలో రూ.5వేలకు ఎకరా లభించేదని, నేడు అదే భూమి రూ.5కోట్లకు చేరుకున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కోరమోని వెంకటయ్య, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, కౌన్సిలర్ కోరమోని వనజా, నాయకుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌లో వైస్ చైర్మన్ తాటి గణేశ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రమేశ్‌కుమార్, రిటైర్డ్ ఎంపీడీవో కుమారస్వామి, రిటైర్డ్ డీఎంహెచ్‌వో మాణిక్యరావు, ఉద్యోగులు కృష్ణయ్య, నర్సింహ, తులసీరాంతోపాటు టీడీగుట్ట, కొత్తగంజ్, మోతినగర్, బోయపల్లిగేట్, కిద్వాయిపేటకు చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే మహబూబ్‌నగర్ కొత్తగంజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్యముదిరాజ్, జిల్లా ్రప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం పట్టణంలోని బండ్లగేరిలో నివాసముండే సబిల్ట్రస్ట్ అధ్యక్షుడు మౌలానా నయీమ్ కౌసర్ రషాదీ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఆయన నివాసానికి చేరుకున్న విషయం తెలుసుకున్న మంత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 5 : మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జాండ్ర సంఘం ఆధ్వర్యంలో బండ్లగేరిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, రోడ్ షోలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. క్రేన్ సాయంతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. కురిహినిశెట్టి కాలనీలోని మైసమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో కలిపామని, ఆలయ మండపానికి రూ.5లక్షలు, పద్మావతి కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనానికి రూ.కోటీ, జాండ్ర కులస్తులకు 180 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ రామలింగం, పద్మజా, మహేందర్, మల్లేశ్ తదితరులు పాల్గ్గొన్నారు.