మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 16 : అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాలమూరు దశ మారిపోయిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురపాలికశాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అధ్యక్షతన శుక్రవారం శిల్పారామంలో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొమ్మిదేండ్ల కిందట పట్టణంలో 14రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరును పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేశామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 24గంటల విద్యుత్ అందిస్తూ పరిశ్రమలు, వివిధ వ్యాపారం చేసుకునే వారు, గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ప్రధాన రోడ్లను విశాలం చేయడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిందన్నారు.
అలాగే మురుగు సమస్య లేకుండా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీలను నిర్మించామన్నారు. ప్రధాన చౌరస్తాలలో ప్రముఖుల విగ్రహాలతో పాటు జంక్షన్లు, పార్కులు ఏర్పాటు చేసి పాలమూరును పట్నానికి తీసిపోని విధంగా రూపొందిస్తున్నామన్నారు. పట్టణంలో కొత్తగా ఆరు మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఆరు కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. రూ.300కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామని, మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది నాటికి ఐటీతో 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతమున్న శిల్పారామం ఒకప్పుడు దు ర్గంధంతో ఉండేదని, పర్యాటక ప్రాం తంగా తీర్చిదిద్దామన్నారు. వీరన్నపేటలో 800 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, చిన్నదర్పల్లిలో 350 ఎకరాల్లో ఫుడ్‌పార్క్ రానున్నదన్నారు. అప్పన్నపల్లి రెండో ఆర్వోబీ పూర్తయ్యిందని, కేవలం 12నెలల్లో పూర్తి చేశామని వెల్లడించారు.
70ఏండ్లలో సాధ్యంకాని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో అభివృద్ధి లో దూసుకుపోతున్నదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముం దు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహిళలతో కలిసి పట్టణ ప్రగతిని వీక్షించారు. పురపాలిక శాఖ ఆధ్వర్యంలో మంత్రిని గజామాలతో సత్కరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. నవభారతి, పిల్లల మర్రి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.6కోట్ల 30లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 16 : ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన తెలంగాణ రేడియాలజీ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే ఆలోచించే ప్రజలు ఇప్పుడు క్యూ కడుతున్నారన్నారు. దుర్గంధంతో నిండి ఉండే దవాఖాన నేడు అన్ని హంగులతో పాటు వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా
అందిస్తున్నారన్నారు. గతంలో ఒక ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, 25 మంది నర్సులు, 30మంది పనివా రు ఉండేవారన్నారు. ప్రస్తుతం 37మంది ఫార్మసిస్టులు, 44మంది ల్యాబ్ టెక్నీషియ న్లు, 250మంది నర్సులు, అలాగే వర్కర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నామన్నా రు. ఐసీయూ బెడ్లతో పాటు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన తెలంగాణ రేడియాలజీ హబ్‌ను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్‌స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని, ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ దవాఖాన పర్యవేక్షకుడు రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ రాధ తదితరులు
ఉన్నారు.