కోయిలకొండ, జూలై 28 : అమ్మరో బీమమ్మ.. మా తల్లిరో బీమమ్మ.. అన్న పాటలతో పీర్ల సవారీ జరగనున్నది. శనివారం మొహర్రం వేడుకలకు సర్వం సిద్ధమైంది. కోయిలకొండలో జరిగే పీర్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. పీర్ల సవారీ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. బీ ఫాతిమాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తెల్లవారుజామున మండల కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో అగ్నిగుండం కార్యక్రమం తర్వాత బీమమ్మ పీరును ఊరేగింపునకు తరలిస్తారు. అంతకు ముందు సంప్రదాయ ప్రకారం అమ్మకు ప్రభుత్వం అందించే సర్కారు శక్కరను తాసీల్దార్ కార్యాలయం, గ్రామ సర్పంచ్‌తోపాటు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అందించనున్నారు. ఖిల్లా నుంచి బీ ఫాతిమా పీరును ఊరేగింపుగా తీసుకొచ్చి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయించనున్నారు. ఈ సందర్భంగా అలాయ్.. బలాయ్.. మహిళల బతుకమ్మలు అలరించనున్నాయి. రెండ్రోజులపాటు వేడుక అంగరంగ వైభవంగా జరగనుండగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. బీ ఫాతిమాకు కందూర్లు చేసి మొక్కు లు తీర్చుకుంటారు. శుక్రవారం ఖిల్లా గుట్ట బీ ఫాతి మా ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. పీర్ల దర్శ నం కోసం భక్తులు గంటల కొద్దీ బారులుదీరారు.
అలరించనున్న పీర్ల సవార్లు
బీ ఫాతిమా భర్త మొగులాలి యుద్ధంలో మరణించాడని బీ ఫాతిమా పీరుకు డాల్సాబ్ చెప్పే విధానం భక్తులను అలరించనున్నది. భర్త మరణవార్తను చెవులతో వినకూడదని బీ ఫాతిమా పీరు తప్పించుకొని ఖిల్లాకు వెళ్లే సన్నివేశం మొహర్రం ఉత్సవంలో ప్రత్యేకంగా నిలవనున్నది. అలాగే మండలంలోని పారుపల్లి, అంకిళ్ల, ఇబ్రహీంనగర్ గ్రామాల నుంచి వచ్చే పీరుల ఊరేగింపులో ఉన్న బీ ఫాతిమా పీరును దర్శించుకొని వెళ్తాయి. సాయంత్రం ఖిల్లా నుంచి బీఫాతిమా పీరుతోపాటు మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన మిగితా పీర్ల నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. మొహర్రం ఉత్సవాల్లో ఆఖరి ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో పోలీసులు పడక్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై సతీశ్ పర్యవేక్షణలో గుట్టతోపాటు వాహనాల పార్కింగ్ వద్ద పోలీసులు గస్తీ కాయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌కు సంబంధించి ఏర్పాట్లను చేసినట్లు సర్పంచ్ కృష్ణయ్య తెలిపారు.