అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్ల నుంచి 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు జిల్లాల్లో 3,336 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 28,89,871 (పురుషులు 14,43,543, మహిళలు 14,46,229) మంది ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. వీరితోపాటు 37 మంది ఎన్ఆర్ఐలు, 62 మంది ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కు ఉన్నది. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బందికి వీవీ ప్యాట్లు, ఈవీఎంలను అందజేశారు. అనంతరం ప్రత్యేక వాహనాలలో పోలింగ్ బూత్‌ల వద్దకు వీరిని తరలించారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియను కొనసాగించనుండగా.. 1,098 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడల్, మహిళా పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పకడ్బందీగా పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,89,871 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 14,43,543 మంది పురుషులు, 14,46,229 మంది మహిళలు, 37మంది ఎన్నారైలు, 62మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరందరికీ ఎన్నికల సంఘం తరఫున ఆయా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ స్లిప్పులను అందజేశారు. ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటరు ఐడీకార్డు చూపించిన వారికి ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లను చైతన్యం చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహించింది. మరోవైపు ఈవీఎంలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.. పోలీస్‌స్టేషన్ ఎదుట ఈవీఎం పోస్టర్లను అంటించారు. అభ్యర్థుల పేర్లు, వాళ్ల గుర్తులు సీరియల్ నంబర్‌గా పెట్టి ఓటు ఎలా వేయాలో డిస్ప్లే చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,336 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1,098 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ముస్తాబు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అలంకరించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను, ఓటర్ స్లిప్పులను పోలింగ్ సిబ్బందిని భారీ భద్రత మధ్య తరలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా జిల్లాలో అదనపు బలగాలను రప్పించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పోలీసులను కూడా ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నారు. పోలింగ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా జిల్లా కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియ అంతటికి వీడియో తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రక్రియను కంట్రోల్ రూం ద్వారా ఇటు పోలీసు యంత్రాంగం జిల్లా రిటర్నింగ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండి మానిటరింగ్ చేసే విధంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తమయ్యేందుకు అదనపు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోని ఆంక్షలు విధించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12నియోజకవర్గాల్లో 173 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల క్యాండిడెట్లే కాకుండా చాలామంది ఇండిపెండెంట్లు ఈసారి బరిలో ఉన్నారు. అత్యధికంగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 24 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, నారాయణపేట నియోజకవర్గం నుంచి ఏడుగురు బరిలో ఉన్నారు. కల్వకుర్తి, గద్వాల నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువమంది పోటీ చేస్తున్నందునా ఇక్కడ రెండు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పక్షం రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మైకులు, ప్రచార రథాలతో గ్రామాల్లో హోరెత్తించారు. ప్రచారం ముగిసిన వెంటనే చివరి రెండు రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటా లు పడ్డారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా రాజకీయ పార్టీలు పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు.. ఎన్నికల నిబంధనలు అనుసరించి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇం దుకు అవసరమైన బలగాలను వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,336 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, వసతి, టెంట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న ఓటర్లకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కు కలిగిన వారందరికీ ఇప్పటికే స్లిప్పులు అందించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లకు స్లిప్పులు అందించేందుకు, ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కంట్రోల్ రూం నుంచి మానిటరింగ్ చేయనున్నారు. అంతేకాకుండా అధికారులు పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.. కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలు జరిగినా వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ ప్రక్రియ చదువుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందబస్తును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుచుండడంతో పోటీకి దిగిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటీ చేసిన అభ్యర్థులు గత 15రోజులుగా గ్రామాల్లో పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వినూత్నంగా ప్రచారం చేపట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రచారం ముగియడంతో ఓటర్లను సైలెంట్ గా కలిసి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఆయా చోట్ల రాజకీయ పార్టీలు పోటాపోటీగా భారీగా మద్యం డబ్బులను పట్టించారు. ఎన్నికల్లో ఓటర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన నగదును కూడా పట్టించారు. పోలింగ్ వేళ ఆయా పార్టీలు ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారో నని ఆందోళనలో ఉన్నారు. కాగా డిసెంబర్ 3న అభ్యర్తుల భవితవ్యం తేలనుంది.