మక్తల్ : ప్రభుత్వ బడుల (Government Schools) బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ ( MEO Anilgoud ) కోరారు. మక్తల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు, మహిళా సమైక్య సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సభ్యులు బడిఈడు పిల్లలందరినీ గుర్తించి ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చదువును మద్యలో మానేసిన వారిని గుర్తించి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నేడు విద్యాబోధన ఎంతో నాణ్యతగా అందుతుందని పేర్కొన్నారు. మండలంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.