గద్వాల, డిసెంబర్ 23 : యాసంగి సీజన్ మొదలై రైతులు సాగు సిద్ధమైనా ఇప్పటి వరకు రైతు భరోసాపై అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వక పో వడం రైతులు పెట్టుబడి సాయం కోసం నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మిగిల్చింది. యాసంగిలో నైనా పంట లు సాగు చేసి అప్పుల ఊబి నుంచి బయట పడుదామన్నా రైతన్నకు ప్రభుత్వ చేయూత ఇవ్వకపోవడంతో సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో రైతన్నలు ఉన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభం కావడం విత్తనాలు విత్తడం అవి మొలకెత్తిన తరుణంలో రైతులకు ఎరువుల కోసం డబ్బులు అవసరం అవుతుండడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉన్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో నేరుగా రైతు బంధు జమచేయడంతో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పంటలు సాగు చేసుకునే వారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు రైతు భరోసాపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు, రైతులకు అవసరమైన ఎరువులు అందించడంలో వి ఫలం కావడంతో అటు రైతులు రైతు భరోసా అంద క, ఇటు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక పోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఇటు వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించడంతోపాటు ఎరువులకు డబ్బులు ఖర్చు అవుతుండడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభం కాగానే రైతులకు రైతుబంధు ఇవ్వడంతో రైతులు సంబురంగా సాగు చేసుకునేవారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు సాగు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా సమయానికి ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
యాసంగి సీజన్ ప్రారంభమైనా.. ఊసే లేని రైతు భరోసా
యాసంగి సీజన్ వచ్చిందంటే పంటలకు పెట్టుబడి కాలంగా చెప్పాలి. రైతులు వ్యవసాయ భూము లు చదునుచేసి దుక్కిదున్ని విత్తనాలు, ఎరువుల కో సం పెద్దమొత్తంలో ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతులు వరి సాగు కోసం తమ పొలాలను సిద్ధం చేసి ఉంచారు. ఆరుతడి పంటలు వేసే రైతులు దు క్కులు దున్ని విత్తులు విత్తారు. యాసంగి సీజన్ ప్రా రంభమైన ప్రభుత్వం రైతు భరోసా కింద అందించాల్సిన సాయం సకాలంలో రైతు చేతికి అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా ఊసే లేకుండా పోయింది.
ఎన్నికల స మయంలో రైతులందరికీ ఎటువంటి షరతులు లే కుండా రైతుభరోసా ఇవ్వడంతోపాటు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భరోసా రైతులకు ఎప్పుడు ఇస్తారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పి గత యాసంగిలో పాత రైతుబంధు మా త్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. తర్వాత సీజన్లో పెంచిన రైతు భరోసాలో కోత విధించి రైతులకు ఇచ్చింది. ప్రస్తుత యా సంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా ఇవ్వడంలో కాలయాపన చేస్తుండడంపై రైతులు ప్రభుత్వం తీరు పై అసంతృప్తితో రగులుతున్నారు. అసలు రైతు భరో సా ఇస్తారో ఇవ్వరో అనే ఆందోళనలో రైత న్న కొట్టుమిట్టాడుతున్నాడు. కౌలు రైతులకు రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
బీఆర్ఎస్ హయాంలో డిసెంబర్ చివరి నాటికి రైతు బంధు పంపిణీ
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీజన్ ప్రారంభం మొదలు రైతు బంధు పంపిణీకి శ్రీకారం చుట్టి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేది. గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పంపిణీ చేసిన వివరాలను పరిశీలిస్తే 2021లో జూన్ 21న, 2022లో జూన్29న, 2023లో జూన్ 27 రైతు బంధు పంపిణీ చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. 2023లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ సందర్భంగా గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. మిగిలిపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విడుదల చేసింది. ఓ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా రైతులకు ఇవ్వలేదు. 2025-2026 వానకాలం సీజన్‌కు సంబంధించి 1,69,299 మంది రైతులకు రూ.268.84కోట్లు చెల్లించింది.యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు 1.95లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీరందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా చెల్లించాల్సింది. ఇప్పటికైనా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా రైతు భరోసా పంపిణీ చేయాలని రైతు లు కోరుతున్నారు.
యూరియా కష్టాలు తప్పడం లేదు
ప్రభుత్వం యాసంగికి సంబంధించి రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే విత్తులు విత్తుకోవడానికి, కూలీలకు డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం కాగానే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమచేసే వారు. దీంతో ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడేది.ప్రస్తుతం రైతులకు రైతు భరోసా రాక, ఎరువులు సక్రమంగా అందకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వెంటనే రైతు భరోసా రైతులకు అందించాలి. అప్పు తెచ్చి పంట సాగుతో పాటు ఎరువులు కొనుగోలు చేద్దామంటే యూరియా దొరకడం లేదు.
– వెంకటన్న రైతు, అగ్రహారం, గద్వాల మండలం
రైతులపై కక్ష సాధింపులు ఎందుకు?
రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుంది. సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం ఎరువుల కోసం ఆసాములు వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆసాముల వద్ద అప్పుగా పెట్టుబడి సాయం తెచ్చుకున్నా..పంట సాగుకు యూ రియా దొరకడం లేదు. రెండు సీజన్లుగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వరి పంట సాగు చేశా. యూరియా కోసం పీఏసీసీఎస్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం సీజన్ ప్రారంభమైనా రైతు భరోసా ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది.
– మహింద్ర, చిన్నపాడు, గద్వాల మండలం