మూడు రోజుల్లో క్లియర్ చేస్తాం
27వ ప్యాకేజీ కాల్వ చివరలో జమ్ము, పూడిక ఉండడం వల్ల నీరు ముందుకు వెళ్లడం లేదు. వీటిని తొలగించే పనులు జరుగుతున్నాయి. మరో మూడు రోజుల్లో పూర్తి చేసి సాగునీటిని అందిస్తాం. ప్రస్తుతం కాల్వపై అధికంగా మోటర్లు ఉండడం వల్ల కూడా దిగువకు నీరు వేగంగా వెళ్లడం లేదు. వచ్చిన నీటిని రెండు రకాలుగా ఉపయోగించడంతో చివరి గ్రామాల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. అయినా సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా మాకు సహకరించాలి.
– కేశవరావు, ఈఈ, భీమా ప్రాజెక్టు, వనపర్తి జిల్లా
వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : మూడు నెలల నుంచి కృష్ణానదికి వరద హోరెత్తుతున్నా.. ఇక్కడి పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. గలగలా పారాల్సిన సాగునీటి కాల్వలు నీరులేక బోసిపోతున్నాయి. ఎండాకాలంలో చూడాల్సిన కాల్వ పూడిక తీతలను రై తులు కన్నెర్ర చేయడంతో అనంతరం మొదలు పెట్టారు. భీమా ఫేజ్-2లోని 27వ ప్యాకేజీ కాల్వపై ఆధారపడ్డ చివరి గ్రామాల రైతులకు ప్రభుత్వం ముచ్చెమటలు పట్టిస్తున్నది. వెరసి స్వయంగా మ ంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోనే సకాలంలో సాగునీరు అందక రైతులు గోస పడుతున్నారు.
ఈ ఏడాది వచ్చినంత ముందుగా కృష్ణానదికి వరద నీరు రాలేదనే చెప్పాలి. దాదాపు మే నెలలో జూరాలకు వరద పోటెత్తింది. మే 29న 85 వేల క్యూసెక్కుల వరదను జూరాల నుంచి దిగువకు విడుదల చేయడం మొదలై ఆగస్టు 7వ తేదీ వరకు 23 వేల క్యూసెక్కులు దిగువకు పారాయి. గడిచిన జూన్, జూలై నెలల్లో ఏ ఒక్క రోజు కూడా జూరాల డ్యాం గేట్లు మూసుకోలేదు. వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. సుమారు 430 టీఎంసీలు ఈ ఏడాది వానకాలం సీజన్లో జూరాల ప్రాజెక్టును తాకుతూ పరవళ్లు తొక్కాయి.
ఇంతగా నదుల్లో నీరున్నా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఎత్తిపోతల పథకాల కాల్వలకు సాగునీరు పుష్కలంగా అందకపోవడం విచారకరం. ఎంజీకేఎల్ఐ, భీమా-1, 2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ద్వారానే దాదాపు పది లక్షల ఎకరాలకుపైగా సాగునీటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అం దించారు. ప్రస్తుతం వర్షాల ప్ర భావం అంతగా లేకున్నా.. కృష్ణానదిలో వరదల ప్ర వాహం జోరుగా ఉం డటాన్ని కాంగ్రెస్ సర్కార్ అందిపుచ్చుకోవడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.
27వ ప్యాకేజీలో..
భీమా ఫేజ్ -2లో అంతర్భాగమైన 27వ ప్యాకేజీ కాల్వ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇప్పటి వరకు సాగునీరు అందడం లేదు. సమయానికి నీరు రానందునా రైతులు నానా తంటాలు పడుతున్నారు. 64 కిలో మీటర్ల పొడవున్న ఈ కాల్వలో పట్టుమని సగం వరకు నీరందడం లేదు. సరికదా.. కేవలం 30 కిలోమీటర్ల మేర సాగునీరు పారిందని చెబుతున్నా.. ముందు వరకు సాగునీరు ఎప్పుడు చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే వరి నాట్లు, ఇతర పంటలు సాగవ్వాల్సి ఉండ గా, చాలా వరకు పనులు మొదలు పెట్టనేలేదు. ముందున్న కొంత ఆ యకట్టుకు మాత్రం నీరు సమృద్ధి అందుతున్నా మిగిలిన గ్రామాలకు పరిస్థితి ఎండమావిగానే మారింది. ఈ కాల్వ కింద దాదాపు 49 వేల ఎకరాలు సాగుబడులుంటే, చివరి వరకు నీళ్లు వెళ్లడం లేదు. దీంతో గడిచిన ఐదారేండ్లలో 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందిస్తూ వ చ్చారు. మిగిలిన మరో 19 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీటి సంగతిని మరిచిపోయారు. ఇంకా పిల్ల కాల్వలు తవ్వకుండానే వదిలేశారు. దీంతో ఈ ప్యాకేజీలో సగానికి.. సగం ఆయకట్టు పడిపోయింది. ప్రస్తు తం 15 వేల ఎకరాలకు కూడా సాగునీరందడం లేదు. ఉన్న కాల్వలకై నా నీరొస్తే పంటలు సాగుచేద్దామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.
ఆలస్యంగా గుర్తించి..
27వ ప్యాకేజీ కాల్వ కానాయపల్లి శంకరసముద్రం నుంచి ప్రారంభమవుతుంది. సుమారు 64 కి.మీ. పొడవున్న ఈ కెనాల్లో అక్కడక్కడ జమ్ముతో నిండిపోయింది. దీంతో చివరి గ్రామాలకు నీరు వెళ్లడం లేదు. ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎట్టకేలకు రెండు, మూడు హిటాచీలను ఏర్పాటు చేశారు. ఈ మిషన్లు కాల్వలోకి దిగకుండా పైనుంచి తీయడం వల్ల అందినచోట మాత్రమే తీస్తున్నారు. అందని చోట అలాగే వదిలేయడం వల్ల కాల్వలో యథావిధిగా పూడిక, జమ్ము కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు కాల్వలో జమ్ము తీయాల్సిన అవసరం ఉన్నది. ఆలస్యంగా గుర్తించినా ఒకేసారి పకడ్బందీగా పూడిక తీయించడం ద్వారా కనీసం ఒక సీజన్లోనైనా రైతాంగం చివరి భూములకు సాగునీరందే అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంత్రి నియోజకవర్గంలోనే..
మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గంలోనే సాగునీటికి కష్టా లు మొదలయ్యాయి. మూడు నెలలుగా నదులు పారుతున్నా.. ఇక్కడి కాల్వల్లో చుక్కనీరు పారడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 27వ ప్యాకేజీలో నియోజకవర్గంలోని ఏ కాల్వ చూసినా ఎండిపోయిన పరిస్థితే కనిపిస్తున్నది. ప్రధానంగా పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో దాదాపు పది గ్రామాల రైతులకు ఈ ప్రభావం పడుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షం లేదు.. ఎత్తిపోతల కాల్వల ద్వారా అయినా సాగునీరు వస్తుందా? అంటే అదీ రాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చి అలా వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, వల్లభాపురం, వల్లభాపురం తండా, కొర్లకుంట, బొల్లారంతోపాటు 27వ ప్యాకేజీలోని 23వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా పుల్గర్‌చర్ల, కల్వరాల, వీపనగండ్ల, సంగినేనిపల్లి, సంపట్రావ్‌పల్లి గ్రామాల రైతులు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు.
ముదురుతున్న నార్లు..
ఎండుతున్న వరి సమయానికి సాగునీరందుతుందన్న ఆశతో సాగు చేసిన రైతులకు, ఇంకా వరి నాట్లు వేయని అన్నదాతలు వేర్వేరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముందుగా సాగుచేసిన వారికి నీరు లేక పంట ఎండి పోవడం ఒకటైతే, నాటు కోసం పోసిన నారు ముదిరి ఎండుతుండడంతో రైతులు బెంగపడాల్సి వస్తున్నది. ఇలా రెండు రకాల సమస్యలతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని వ్యవసాయ రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మూడు నెలల నుంచి నదులు పొంగిపొర్లుతుంటే, మాకు ఇంతలా సాగునీటి దుర్గతిని పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంత ఆలస్యంగా నీరందిస్తే.. మళ్లీ చివరి వరకు సాగునీరందడం కూడా కష్టమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో వానకాలం వర్షాలు ఏమాత్రం రైతులకు సహకరించడం లేదు. దీంతో కాల్వలకు చివరగా ఉన్న గ్రామాల రైతులు అటు.. ఇటు కాకుండా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే కాల్వలకు సాగునీరు విడుదల చేయాలి.
రెండెకరాలు ఎండుతుంది
కాల్వ నీటిని నమ్ముకుని రెండు ఎకరాలు నాటుకున్నా. పైన నీళ్లున్నా రాలేదు. వస్తాయని చెబుతున్నారు. నెల దాటినా బొట్టు కూడా రాలే. చేను ఎండుతుంది. పెట్టుబడి గతి ఏం కావాలి? ఎలా బతకాలి..? ఈ ఏడు నేను కొత్తగా చేసిందేమీ లేదు. మునుపటి నుంచి చేసినట్లే చేశా. ఎందుకు నీళ్లు రావడం లేదో అర్థం కావడం లేదు. అధికారులు ఇప్పటికైనా కాల్వకు నీరొచ్చేలా చూడండి. మా పొలాలను ఎండకుండా చూడండి.
– నారాయణ, కొర్లకుంట, వీపనగండ్ల మండలం
సాగునీళ్లు లేక వరి ఎండుతున్నది
ఎకరన్నర పొలంలో వరి సాగు చేశాను. 27వ ప్యాకేజీ కాల్వకు నీళ్లు వస్తాయను కుంటే నిరాశే ఎదురైంది. బోరు సక్రమంగా నీళ్లు పోయడం లేదు. వరి ఎండుతున్నది. ఈ పొలాలను అనుసరించు వచ్చే కాల్వలో జమ్ము నిండిపోయింది. నెల కిందట వేసి నాట్లు ఎండిపోతున్నవి. వందలాది మంది రైతుల పరిస్థితి ఇదే.. దాదాపు 400 ఎకరాల్లో వేసిన వరి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఎండిపోయే పరిస్థితి.
– రవీందర్, బొల్లారం, వీపనగండ్ల మండలం